ఫోన్ లు ప‌నిచేయ‌ని చోట మెగా జ్ఞాప‌కాలు

Update: 2021-12-01 03:56 GMT
కొన్ని అవ‌కాశాలు చాలా అరుదుగానే ద‌క్కుతాయి. అస‌లు కాకులు దూర‌ని కారడ‌విలో .. సెల్ ఫోన్ సిగ్న‌ల్ లేని చోట మెగాస్టార్ చిరంజీవితో టైమ్ స్పెండ్ చేసే అవ‌కాశం ద‌క్కితే అది ఎంత‌టి అదృష్ట‌మో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల త‌న అనుభ‌వాల్ని వెల్ల‌డించారు. ఆచార్య చిత్రీక‌ర‌ణ కోసం మారేడుమిల్లి అడ‌వుల‌కు వెళ్లిన‌ప్ప‌టి అనుభ‌వాల్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

ఆచార్య‌ సినిమా షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర ప‌నుల సాగుతున్నాయి. ఫిబ్రవరి 2022లో విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. కొరటాల శివ ఇటీవల ఓ ఇంట‌రాక్ష‌న్ లో మెగాస్టార్- మెగా పవర్ స్టార్ లతో కలిసి పనిచేసిన అనుభవం గురించి వెల్లడించారు. అడ‌వి నేప‌థ్యంలో న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకర‌ణ సాగింది. ఫోన్ సిగ్నల్ లేని ప‌రిస‌రాల‌లో గొప్ప అనుభ‌వం ఎదురైంది. సమీపంలోని రిసార్ట్ లో చిత్ర యూనిట్ బస ఏర్పాటు చేసింది. దాదాపు 15 రోజులు షూటింగ్ కోసం అక్క‌డే ఉన్నామ‌ని కొర‌టాల వెల్ల‌డించారు.

ఫోన్ సిగ్న‌ల్ లేని చోట చిరు-చ‌ర‌ణ్ ల‌తో క‌లిసి ఉండ‌డం అరుదైన అనుభ‌వం. చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యాక మేము తిరిగి రిసార్ట్‌కి వెళ్లేవాళ్లం. ఫోన్ కి సిగ్నల్ లేకపోవడంతో కూర్చొని మాట్లాడుకునేవాళ్లం. ఆయనతో కలిసి వర్కవుట్ చేయడం, ఆయనతో కలిసి భోజనం చేయడం.. ముఖ్యంగా ఆ 15 రోజులు ఆయనతో కలిసి షూట్ చేయడం గుర్తుండిపోతుంది.. అని కొరటాల శివ అన్నారు. ఆ ప్రాంతంలో సిగ్న‌ల్ రావాలంటే 20కి.మీ.లు ప్ర‌యాణించాల్సి ఉంటుంద‌ని కొర‌టాల అన్నారు. కాజల్ అగర్వాల్ - పూజా హెగ్డే ఈ సినిమాలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆచార్య ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News