'కేజీయఫ్' దర్శకుడితో చరణ్.. మెగా వారసుడి లైనప్ మామూలుగా లేదుగా!

Update: 2021-10-15 12:35 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ మెగా ఫ్యాన్స్ కు పూనకలు తెప్పిస్తోంది. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న చరణ్.. టాప్ డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతూ తన స్థాయిని అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నారు. చెర్రీ ప్రస్తుతం కొరటాల శివ - రాజమౌళి - శంకర్ వంటి అగ్ర దర్శకులతో పాటుగా గౌతమ్ తిన్ననూరి వంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా చేరిపోయారు.

'కేజీయఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్.. రాంచరణ్ తో ఓ సినిమా చేయనున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ప్రాజెక్టే అయినా.. తాజాగా వీరు కలిసి కథా చర్చలు జరపడంతో మెగా సెన్సేషనల్ కాంబోకి బీజం పడబోతోందని కంఫర్మ్ అయింది. గురువారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి - చరణ్ - డీవీవీ దానయ్య లను ప్రశాంత్ నీల్ మీట్ అయ్యారు. దీనికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ట్వీట్ చేస్తూ.. ''ఒక లెజెండ్ మరియు కాబోయే మరో లెజెండ్ లను కలుసుకున్నాను. మాకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినందుకు రామ్‌ చరణ్‌ కి ధన్యవాదాలు. చిరంజీవి గారిని కలవడం అనేది నా చిన్ననాటి కల. ఇప్పుడు నిజమైంది'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరు - చెర్రీ లతో కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రశాంత్ నీల్ ని కలవడం ఆనందంగా ఉందని.. ఇదొక మెమరబుల్ కన్వర్జేషన్ అని రామ్ చరణ్ అన్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'కేజీయఫ్ 2' తో పాటుగా ప్రభాస్ తో 'సలార్' సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇదే క్రమంలో రామ్ చరణ్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఆలోపు చెర్రీ కమిటైన ఇతర ప్రాజెక్ట్స్ ఫినిష్ చేస్తారు. ఇప్పటికే కొరటాల దర్శకత్వంలో తన తండ్రితో కలసి 'ఆచార్య' సినిమా షూటింగ్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి చేసిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ 2022 జనవరి 7న విడుదల అవుతుంది.

ఇటీవలే షో మ్యాన్ శంకర్ దర్శకత్వంలో #RC15 మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెట్టారు చరణ్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దసరా కానుకగా ఈరోజు చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించారు. 'జెర్సీ' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చెర్రీ తన 16వ సినిమా చేయనున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ నిర్మించనున్నారు. ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ తో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టనున్నారు.

రామ్ చరణ్ లైనప్ చూసి మెగా ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో వచ్చే నేషనల్ వైడ్ క్రేజ్ ని క్యాష్ చేసుకునే విధంగా మెగా వారసుడి ప్లాన్ ఉన్నాయి. అందుకే బిగ్ డైరెక్టర్స్ తో అన్నీ మల్టీలాంగ్వేజ్ ఫిలిమ్స్ కమిట్ అవుతున్నారని చెప్పవచ్చు.


Tags:    

Similar News