హిట్ ప‌డినా మెహ్రీన్‌ను మ‌ర‌చిపోతున్నారేంటి?

Update: 2022-11-22 00:30 GMT
మెహ్రీన్ కౌర్ పిర్జాదా.‌. ఈ అందాల సోయగం గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' చిత్రంతో సినీ రంగ‌ప్ర‌వేశం చేసిన‌ ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఆ వెంటనే మెహ్రీన్ నటించిన 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాలు మంచి విజయం సాధించడంతో.‌. యూత్లో ఈ బ్యూటీకి సూప‌ర్ క్రేజ్ ఏర్పడింది. దీంతో మెహ్రీన్ కు వ‌రుస‌ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె తెలుగుతో పాటు తమిళ, పంజాబీ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. కానీ కథల‌ ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా మెహ్రీన్ వ‌రుస ఫ్లాపుల్లో మునిగిపోయింది.

అలాంటి తరుణంలో అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన 'ఎఫ్'2 సినిమా మెహ్రీన్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. కానీ ఏం లాభం.. అంతలోనే మళ్లీ ప‌రాజ‌యాలు ఆమెను వెంటాడాయి. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ 'ఎఫ్ 3' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఎఫ్ 2 కు సీక్వెల్ గా అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

అయితే హిట్ ప‌డినా కెరీర్ పరంగా మెహ్రీన్ లో మునుపటి జోరు కనిపించడం లేదు. మెహ్రీన్ వైపు స్టార్ హీరోలు కాదు కదా యంగ్ హీరోలు కూడా చూడటం లేదు.  'ఎఫ్ 3' విడుదల అనంతరం మెహ్రీన్ వరుసగా వెకేషన్ కి వెళ్తూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్లు షేర్ చేస్తుంది. కానీ కొత్త ప్రాజెక్టులను సంబంధించిన అప్డేట్స్ ను మాత్రం ఇవ్వ‌డం లేదు.

ఈ విష‌యంలో ఆమె అభిమానులు ఎంత‌గానో నిరాశ చెందుతున్నారు. తెలుగులో ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఒకే ఒక చిత్రం ఉంది. పైగా అదో డ‌బ్యూ హీరో మూవీ. విక్రాంత్‌ హీరోగా పరిచయం అవుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పార్క్'. ఇందులో మెహ్రీన్, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ సినిమా మిన‌హా.. మెహ్రీన్ చేతిలో మ‌రో తెలుగు చిత్రం లేదు. అయితే ఎఫ్ 3 రూపంలో హిట్‌ పడినా మెహ్రీన్ ను ఎందుకు మ‌ర‌చిపోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, కొద్ది నెల‌ల క్రితం మెహ్రీన్ హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి వరకు వెళ్లకుండానే భవ్య-మెహ్రీన్‌ బ్రేకప్ చెప్పుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News