బ్యాచిలర్ డైరెక్టర్ కు అఖిల్ - పూజా హెగ్డేల మిడ్ నైట్ సర్ప్రైజ్..!

Update: 2021-09-23 13:50 GMT
'బొమ్మరిల్లు' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన భాస్కర్.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకొని సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. వెంటనే 'పరుగు' సినిమాతో మరో విజయం సాధించారు. ఈ క్రమంలో వచ్చిన 'ఆరెంజ్' 'ఒంగోలు గిత్త' సినిమాలు ప్లాప్ అవ్వడంతో టాలీవుడ్ కు కొంతకాలం పాటు దూరమయ్యారు. ఈ గ్యాప్ లో తమిళ్ లో 'బెంగుళూరు డేస్' రీమేక్ తో హిట్ అందుకున్నారు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' అనే తెలుగు సినిమాతో వస్తున్నారు భాస్కర్.

యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా ఈ యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 8న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు భాస్కర్ ఫైనల్ మిక్సింగ్ లో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా గురువారం (సెప్టెంబర్ 23) 'బొమ్మరిల్లు' భాస్కర్ పుట్టినరోజు కావడంతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీమ్ ఘనంగా సెలబ్రేషన్స్ చేశారు. ఈ క్రమంలో హీరోహీరోయిన్లు అఖిల్ - పుజా హెగ్డే మిడ్ నైట్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చి డైరెక్టర్ కు బర్త్ డే విషెస్ చెప్పి సర్ప్రైజ్ చేశారు. భాస్కర్ తో కేక్ కట్ చేయించారు. పూజా తన మొబైల్ లో 'పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి..' అనే సాంగ్ ప్లే చేస్తూ దర్శకుడికి శుభాకాంక్షలు తెలిపి నవ్వులు పూయించింది. ఈ వేడుకలలో నిర్మాతలు బన్నీ వాసు - వాసు వర్మ - ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ - అల్లు బాబీ పాల్గొన్నారు.

కాగా,  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. 'మనసా మనసా' 'గుచ్చే గులాబీ' 'ఏ జిందగీ' 'లెహరాయి' పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రదీశ్ వర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇందులో ఆమని - ఈషా రెబ్బా - చిన్మయి - వెన్నెల కిషోర్ - మురళీశర్మ - జయప్రకాష్ - అమిత్ తివారి కీలక పాత్రలు పోషించారు.

Full View
Tags:    

Similar News