దుబాయిలో బాలీవుడ్‌ స్టార్‌ అరెస్ట్‌..!

Update: 2018-12-07 11:23 GMT
బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ దలేర్‌ మెహందీ సోదరుడు మికాసింగ్‌ సింగర్‌ గా మంచి స్టార్‌ డంను దక్కించుకున్న విషయం తెల్సిందే. కొంత కాలానికే అన్న నీడ నుండి బయట పడ్డ మికాసింగ్‌ పలు సూపర్‌ హిట్‌ పాటలు పాడి అందరిని అలరించాడు. అలాంటి మికా సింగ్‌ ఇటీవల మీటూ ఉద్యమంకు మద్దతుగా మాట్లాడాడు. ప్రతి ఒక్కరు కూడా మీటూలో భాగంగా తమకు జరిగిన అన్యాయంను, లైంగిక వేదింపులను మీడియా ముందుకు  వచ్చి చెప్పాలని ఆయన కోరాడు. మీటూ గురించి స్పందించిన అతి కొద్ది మంది మగవారిలో మీకా సింగ్‌ ఒకరు.

మీటూ ఉద్యమంకు అనుకూలంగా మాట్లాడిన మీకాసింగ్‌ పై తాజాగా దుబాయిలో లైంగిక వేదింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. దుబాయి పోలీసులకు బ్రెజిల్‌ కు చెందిన ఒక అమ్మాయి మికాసింగ్‌ పై కేసు పెట్టింది. తనకు అసభ్య ఫొటోలు పంపడంతో పాటు తనతో అసభ్యంగా మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించాడు అంటూ ఆరోపించింది. దాంతో పోలీసులు మీకాసింగ్‌ ను అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు.

యూఏఈలో ఒక సంగీత విభావరిలో పాటలు పాడేందుకు అక్కడకు వెళ్లిన మీకాసింగ్‌ అరెస్ట్‌ అవ్వడంతో బాలీవుడ్‌ వర్గాల వారు షాక్‌ అవుతున్నారు. మీడియాలో వచ్చిన వార్తలతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీకాసింగ్‌ సన్నిహితులు దుబాయి పోలీసుల నుండి ఆయన్ను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మీకాసింగ్‌ ఆమెను లైంగికంగా వేదించి ఉండడంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో ఎలాంటి విషయాలు వెళ్లడవుతాయో చూడాలి.

Tags:    

Similar News