ఎన్నికలప్పుడు కొందరు బెదిరించారు.. వాటికి ఎవరూ భయపలేదు: మోహన్ బాబు

Update: 2021-10-16 09:51 GMT
'మా' (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) నూతన అధ్యకుడిగా మంచు విష్ణు ఈరోజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘మా’ అనేది కళాకారుల వేదికని.. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని.. మనమంతా ఒకే తల్లి బిడ్డలమని అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమంటే సాధారణమైన విషయం కాదని.. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని విష్ణుకి సూచించారు. అందరూ కలిసి కట్టుగా ఉండాలని.. సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి కానీ.. మీడియాకు ఎక్కొద్దని మోహన్ బాబు 'మా' సభ్యులను కోరారు.

''ఇది కళాకారుల వేదిక. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. రాజకీయాల్లో ఉన్నవారు కూడా ఉండొచ్చు. కానీ మనందరం ఒకే తల్లి బిడ్డలం. మా గురువు గారు దాసరి గారు ఎక్కడ ఉన్నా సరే ఆయన మనసు ఎంతో బాధ పడుతూ ఉంటుంది. పెద్దల్ని మనం గౌరవించుకోవాలి. కళారంగంలో టాలెంట్ ఉంటేనే రాణిస్తారు. లేకపోతే వెళ్ళిపోతారు. 47 సంవత్సరాలు నా జీవితం తెరిచిన పుస్తకం. 'మా' ఎన్నికలు ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్య పోయాను. ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువై పోయాయి. ఇది అవసరమా?'' అని మోహన్ బాబు అన్నారు.

''ఇక్కడ నువ్వు గొప్పా నేను గొప్పా.. నీకు సినిమాలు ఉన్నాయా అనేది కాదు. సినిమాల్లో జయాపజయాలు దైవాధీనం. సినిమాల్లో ఎంత కష్ట పడినా సక్సెస్ మన చేతిలో ఉండదు. నేనెంత అని విర్ర వీగుతాం. మరు క్షణమే పైవాడు ఎక్కడ కొడతాడో దిమ్మ తిరిగేలా కొడతాడు. ఇది తెలుసుకోకుండా మేమంతమంది ఉన్నాం.. ఇంతమంది ఉన్నాం అని కొంతమంది బెదిరించారు. ఆ బెదిరింపులకు 'మా' కళాకారులు సభ్యులు ఎవరూ భయపలేదు. సినిమాలో ఎవరి దయదక్షిణ్యాలు ఉండవు.. కేవలం క్రమశిక్షణ, టాలెంట్ మాత్రమే ఉంటాయి. ఎవరికి భయపడకుండా మా ఓటు మా సొంతం అని నా బిడ్డని గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను''

''నాకు పగ రాగద్వేషాలు లేవు.. అవసరం లేదు. వయసు పైబడుతుంది.. నా కోపం నాకే చేటు చేసింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళని తప్పుబడతారు. ఇంతమంది నా బిడ్డను ఆశీర్వదించినపుడు ఆ దేవుళ్లు ఎందుకు.. ఆ గుడులు ఎందుకు. మీరే దేవుళ్లు. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను. కళాకారులారా అందరూ ఒకటిగా ఉండండి. ఓటు వేయని వాళ్లపై పగ వద్దు. ఎందుకంటే ఆ పగ మనిషిని సర్వనాశనం చేస్తుంది'' అని మోహన్ బాబు హితవు పలికారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''మీరందరు కలిసి భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఖ్యాతి తీసుకురావాలి 'మా' అసోసియేషన్‌ కు. ప్రమాణ స్వీకారం అయ్యాక సమయం చూసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవాలి. సీఎం ను నేనే వెళ్లి కలుస్తా. ‘మా’ సభ్యులకు ఇళ్ల నిర్మాణం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. సీఎం మాట ఇస్తే తప్పేమనిషి కాదు'' అని పేర్కొన్నారు. ''విష్ణుకు సీనియర్ హీరోలైన కృష్ణ - కృష్ణంరాజు వంటి పెద్దలు ఓటు వేయడానికి రాలేదు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే.. అసోసియేషన్‌ తో మీకు సంబంధం లేదు అనుకోకండి. ఇది మన అసోసియేషన్‌. విష్ణు టీమ్ కు మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం'' అని అన్నారు.

''రెండు సంవత్సరాలే అయినా 'మా' అధ్యక్షుడు చిన్న ఉద్యోగం కాదు. కొంతమంది ఇది చిన్న ఉద్యోగం అనుకుంటారు. అది ఒక పెద్ద బాధ్యత. ఎంతో మంది మహామహులు దీన్ని ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ నేను చెప్పేది ఒక్కటే.. మీలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రెసిండెంట్‌ తో చెప్పి సమస్యలను పరిష్కరించుకోండి. అంతేకానీ, ఇంతకుముందు జరిగినట్లుగా రోడ్లకు, టీవీ లకు ఎక్కొద్దు'' మోహన్ బాబు కోరారు.

''చిత్రపురి కాలనీని హెరిటేజ్ గా మార్చేద్దామని అప్పటి సీఎం భావిస్తే.. పేద కళాకారులకు ఇచ్చిన చిత్రపురి కాలనీ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని నేను అప్పటి గవర్నర్‌ రంగరాజన్ కు లేఖ రాశాను. ఇలా ఎన్నో చేసాను. కానీ అందరూ అది మర్చిపోయారు. వాళ్లు గుర్తుపెట్టుకున్నా లేకున్నా.. నా కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కలిసిమెలిసి ఉందాం.. కలిసి గట్టుగా సాధిద్దాం. నా బిడ్డ గెలుపుకు నరేశ్‌ మామూలు సాయం చేయలేదు. విష్ణు గెలుపులో నరేష్ కీలకం. రెండు నెలలుగా షూటింగ్స్‌ ఉన్నా సరే.. వాటన్నింటి నుంచి కొంత సమయం తీసుకుని మరీ నా కొడుకు కోసం పనిచేశాడు. నరేశ్‌ ని ఎప్పటికీ మర్చిపోను. దయచేసి ఇకనైనా టీవీలకు ఎక్కకండి.. మనుషుల్ని రెచ్చగొట్టకండి" అని మోహన్ బాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News