కోవిడ్ టైంలో బిజీగా మారుతున్న సినిమా వాళ్ళు..!

Update: 2020-12-09 03:30 GMT
సినీ ఇండస్ట్రీ ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి అందరూ శ్రమిస్తున్నారు. ఇంతకముందు డీ మానిటైజేషన్‌ వ‌చ్చినప్పుడు అస‌లు సినిమా ఇండ‌స్ట్రీ అయిపోయింది అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు తీయాలన్నా నిర్మాతలకు కష్టమేనని.. ఫ్లో లేకపోవడంతో కొత్తగా వచ్చే నిర్మాతలు రావడానికి జంకుతున్నారని కామెంట్స్ చేశారు. అయితే డీ మానిటైజేషన్‌ త‌రువాతే నిర్మాణ సంస్థ‌లు భారీ పెట్టుబ‌డులు పెట్టి సినిమాలు నిర్మించ‌డం మొద‌లుపెట్టాయి.

ఇప్పుడు క‌రోనా టైమ్ లో సినిమా వాళ్లు అష్ట‌క‌ష్టాలు పడుతున్నారు. ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని నిపుణులు అన్నారు. అయితే ప్రభుత్వం లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చాక‌ నెమ్మ‌దిగా షూటింగ్ లు మొద‌లైయ్యాయి. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవా స్టార్ట్ అయ్యాక శాటిలైట్ రైట్స్ కు రెక్క‌లు రావ‌డం.. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు త‌మ వేత‌నాలు త‌గ్గించ‌డంతో రోజుకో కొత్త సినిమా ఓపెనింగ్ జ‌రుగుతోంది. అలానే భారీ బడ్జెట్ సినిమాల అనౌన్స్ మెంట్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ బిజీగా మారిపోతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు సినిమా వాళ్లు ఎంత బిజీగా ఉన్నారంటే సినిమా షూటింగ్ కి యూనియ‌న్ ప్రొడ‌క్ష‌న్ వాళ్లు దొర‌క‌డం లేదు. దీంతో షూటింగులలో భోజనాల‌కి బ‌య‌ట క్యాట‌రింగ్ లు మీద ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంద‌ట‌. ఏదేమైనా సినీ ఇండస్ట్రీ త్వరలోనే పూర్వ వైభవం తెచ్చుకోనుందని చెప్పవచ్చు.
Tags:    

Similar News