కరోనా ‘సినిమా’కు 100 డేస్

Update: 2020-06-25 01:30 GMT
ఇండియాలో థియేటర్ల వ్యవస్థ మొదలైనప్పటి నుంచి చూస్తే.. దేశవ్యాప్తంగా వరుసగా వంద రోజుల పాటు ఇండియాలో మొత్తం థియేటర్లన్నీ మూత పడి ఉన్న దాఖలాలు ఎప్పుడూ కనిపించవు. థియేటర్లకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే.. లేదా పెద్ద స్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనపుడు.. కొన్ని ప్రాంతాల వరకు కొన్ని రోజుల పాటు థియేటర్లు మూతపడి ఉన్నాయి తప్ప ఇలా దేశం మొత్తం థియేటర్లు మూత పడటం అన్నది ఎన్నడూ జరగలేదు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందన్న ఊహ కూడా ఎవ్వరికీ లేదు. ఐతే దేశంలో ఎన్నడూ చూడని ఎన్నో వింతలు జరిగేలా చేసిన కరోనా.. థియేటర్లకు తెరదించింది. దీన్ని నమ్ముకున్న లక్షల మంది అన్యాయం అయిపోయారు. దేశవ్యాప్తంగా చూస్తే థియేటర్లు మూతపడటం వల్ల ఎన్ని వేల కోట్ల నష్టమో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది.

దేశంలో లాక్ డౌన్‌ షరతులు ఒక్కొక్కటిగా సడలిస్తూ వివిధ రంగాలకు మళ్లీ ఊపిరినిచ్చారు. ఆయా రంగాల్లో యధావిధిగా పనులు నడుస్తున్నాయి. మునుపటి స్థాయిలో కాకపోయినా వ్యాపారాలైతే నడుస్తున్నాయి. కానీ థియేటర్ల వ్యవస్థ మాత్రం మూతపడే ఉంది. ఇందులో ప్రొజెక్షన్ ఆపరేటర్ దగ్గర్నుంచి క్యాంటీన్ నడిపేవారి వరకు లక్షల మంది ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారు. సినిమా మేకింగ్, డిస్ట్రిబ్యూషన్లో భాగమైన లక్షలాది మంది కూడా పనుల్లేక అల్లాడుతున్నారు. థియేటర్లలో సినిమా బొమ్మ లేకుండా అప్పుడే శత దినోత్సవం పూర్తయింది. ఐతే కరోనా ఇలా థియేటర్లకు ‘సినిమా’ చూపించడం ఇంతటితో ఆగేలా లేదు. రజతోత్సవాలు కూడా తప్పేలా లేవు. ఇంకో రెండు మూడు నెలల్లో థియేటర్లు తెరుచుకునే సంకేతాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. ఈ ఏడాది ఏదో ఒక దశలో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ మునుపటిలా రెవెన్యూ మాత్రం సాధ్యపడేలా లేదు. ఈలోపు ఎన్ని జీవితాలు రోడ్డున పడతాయో?
Tags:    

Similar News