చైతూకు స‌మంత క‌న్నాఅవే ముఖ్య‌మ‌ట‌!

Update: 2017-07-09 13:09 GMT
టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే పిచ్చ క్రేజ్‌. అందుకే, స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా రాంచీ రోడ్ల‌పై ర‌య్ మ‌ని దూసుకెళ్తుంటాడు ధోనీ. అదే త‌ర‌హాలో టాలీవుడ్ లో నాగ‌చైత‌న్య‌కు బైకులంటే మహా పిచ్చి అని ఇండ‌స్ట్రీలో అంద‌రికీ తెలుసు. చైతూ దగ్గర బైక్ కలెక్షన్ చాలానే ఉంది. అప్పుడ‌ప్పుడూ చైతూ బైక్ రేసుల్లో కూడా పోటీ పడుతుంటాడు. అందుకే త‌న తొలి సినిమా 'జోష్'లోనూ బైక్ రేసింగ్ స‌న్నివేశాలు చూపించారు.

ఆ బైక్ ల పై ఉన్న మోజు చైతూ కొంప ముంచేలా ఉంది. ఓ టీవీ షో లో పాల్గొన్న నాగచైతన్యను ఇరుకున పెట్టే ప్ర‌శ్నఅడిగాడో అభిమాని. రాణా నిర్వహించే 'నెం.1 యారీ' ప్రోగ్రాంలో నాగ చైత‌న్య పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంలో ఓ అభిమాని ''మీరు హైదరాబాద్‌లో మంచి బైక్ రేసర్ అని విన్నాను. చాలాసార్లు యూట్యూబ్‌లో కూడా చూశాను. మరి పెళ్లి తర్వాత సమంత ఎప్పుడైనా సీరియస్‌గా నీకు నేను ముఖ్యమా.. బైకులు ముఖ్యమా అని అడిగితే ఏం సమాధానం చెబుతావు'' అంటూ ఆ అభిమాని చైతూను అడిగాడు.

దీనికి తల పట్టుకున్న చైతూ ఇదేం ట్విస్టురా బాబూ అంటూ నవ్వేశాడు. చైతూతో కలిసి ఈ షోకు హాజరైన సుమంత్ కూడా....భలే ప్రశ్న అడిగాడు అని చైతూని ఆట‌ప‌ట్టించాడు. ఈ సంద‌ర్భంలో రాణా ... సమంత రేప్పొద్దున బైకులు వద్దు పాడు వద్దు.. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్.. అంటే ఏం చేస్తావ్ ? అని చైతూను రెట్టించి అడిగాడు.

ఒకేసారి ముగ్గురు త‌న‌ను ప్ర‌శ్న‌ల‌తో ఎటాక్ చేయ‌డంతో చైతూ చ‌మ‌త్కారంగా బదులిచ్చాడు. ''నువ్వే ఇంపార్టెంట్ అని సామ్‌కు చెబుతాను. కానీ ఇంటి బయటకు వెళ్లిన తర్వాత బైకే ఇంపార్టెంట్ అని బైక్ తీస్తాను'' అంటూ గట్టిగా నవ్వేశాడు. చైతూ ఇలా చెబుతాడని తనకు ముందే తెలుసని సుమంత్ అంటే.. ఓరి దుర్మార్గుడా అంటూ ఆశ్చర్యపోయాడు రాణా! చైతూ, స‌మంత‌ల పెళ్ల‌య్యాక చైతూ ఇదే స‌మాధానం చెబుతాడో లేదో వేచి చూడాలి మరి!
Tags:    

Similar News