#King100.. ఎలా ఉండాలంటే..?

Update: 2022-09-15 02:30 GMT
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 64 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఓవైపు తన ఇద్దరు కొడుకులు నాగచైతన్య - అఖిల్ లు హీరోలుగా రాణిస్తుండగా.. మరోవైపు నాగ్ కూడా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీదనే కాకుండా.. స్మాల్ స్క్రీన్ లోనూ సందడి చేస్తున్నారు.

గత 38 ఏళ్లుగా ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్న నాగార్జున.. ఈ సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్ ను పరిచయం చేసి సెల్యులాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్నారు. సక్సెస్ ఫుల్ కెరీర్ ని కొనసాగిస్తున్న నాగ్.. ఇప్పుడు తన మైలురాయి 100వ చిత్రానికి చేరువయ్యారు.

నాగార్జున వందో సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుంది.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ఏ డైరెక్టర్ చేతిలో పెడతారు.. ఎలాంటి కథతో రాబోతున్నారు అని సినీ అభిమానులు ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు.

నిజానికి కింగ్ 100వ సినిమాపై చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నారని చెప్పుకున్నారు. కె రాఘవేంద్రరావు నుంచి మోహన్ రాజా వరకూ అనేకమంది పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు.

తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తన నూరవ సినిమాపై స్పందించారు. దీని కోసం పలువురు దర్శకులతో కథా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ సినిమా గొప్పగా ప్రతిష్టాత్మకంగా ఉండేలా చేయాలనుకుంటున్నామని నాగ్ చెప్పారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది.

కింగ్ తమ మైల్ స్టోన్ మూవీని ఏ జోనర్ లో చేస్తే బాగుంటుంది? ఎటువంటి స్టోరీతో రావాలి? ఎలాంటి పాత్రలో నాగార్జున ని చూడాలని కోరుకుంటున్నారు? అనే దానిపై సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  

అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నాగ్.. వర్సటాలిటీతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. భక్తికైనా..రక్తికైనా.. క్లాస్ అయినా.. మాస్ అయినా.. ఎలాంటి పాత్ర చేసినా  సరే తన ప్రత్యేకతను చాటుకున్నారు నాగార్జున.

ఈ క్రమంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ - సూపర్ హిట్స్ అందుకున్నారు. అయితే గత కొంతకాలంగా నాగార్జున తన రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకోలేకపోతున్నారని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. వంద కోట్లు అంటూ వసూళ్ల గురించి మాట్లాడుకునే సినిమా చేయడం లేదని కాస్త నిరాశ చెందుతున్నారు. ఇకపై రాబోయే సినిమాలు ఆ లోటుని తీర్చాలని ఆశిస్తున్నారు.

ముఖ్యంగా నాగ్ 100వ సినిమా ఆయన కెరీర్ లోనే మెమరబుల్ గా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. దీని కోసం అన్ని కమర్షియల్ హంగులు ఉండే ఓ మాస్ యాక్షన్ మూవీ లేదా యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్టుని సెట్ చేయాలని సూచిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.

అంతేకాదు ఓ స్టార్ డైరెక్టర్ చేతిలో ఈ ప్రాజెక్ట్ ని పెట్టాలని అభిప్రాయ పడుతున్నారు. అవకాశం ఉంటే నాగ చైతన్య - అఖిల్ లతో స్పెషల్ రోల్స్ చేయించాలని కోరుతున్నారు. మరి అక్కినేని అభిమానులు కోరుకుంటున్నట్లు అన్ని అంశాలు కలబోసిన స్క్రిప్ట్ కింగ్ 100వ సినిమాకి కుదురుతుందో లేదో చూడాలి.

ఇకపోతే నాగార్జున ఇప్పుడు 'ది ఘోస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. దసరా సందర్భంగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. 'శివ' రిలీజైన రోజే రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నాగ్ నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలు పెంచేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News