సంక్రాంతి ఫైట్ లో రారాజు ఒక్క‌డేనా?

Update: 2022-01-07 15:30 GMT
ఈ సంక్రాంతి పోటీ ర‌స‌వ‌త్త‌రంగా వుంటుందని అంతా భావించారు. భారీ పాన్ ఇండియా స్థాయి సినిమాల‌తో పాటు క్రేజీ హీరోల సినిమాలు కూడా పోటీప‌డ‌తాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. పోటా పోటీగా రిలీజ్ డేట్ లు కూడా ప్ర‌క‌టించారు. థియేట‌ర్ల‌న్నీ సంక్రాంతి బ‌రిలో దిగుతున్న `ఆర్ ఆర్ ఆర్‌, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీస్ కే అంటూ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ రంగంలోకి దిగి మ‌ధ్య‌లో మంత్రాంగం న‌డిపింది. దీంతో జ‌న‌వరి 12న విడుద‌ల చేయాల‌నుకున్న `భీమ్లా నాయ‌క్` ప‌క్కుకు త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.

అయితే ఇక్క‌డే ఓ విచిత్రం జ‌రిగింది. దేశ వ్యాప్తంగా క‌రోనా, ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండ‌టం.. ఉత్త‌రాదిన నైట్ కర్ఫ్యూ విధించ‌డం.. ప‌లు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీని అమ‌లు చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం వంటి కార‌ణాల‌తో ముందు `ఆర్ ఆర్ ఆర్‌`ని ఆ త‌రువాత `రాధేశ్యామ్‌` రిలీజ్ లు వాయిదా వేస్తున్నామంటూ సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకున్నాయి.

దీంతో మిగ‌తా చిత్రాల‌కు లైన్ క్లియ‌ర్ అయిపోయింది. గ‌త కొన్ని రోజులుగా థియేట‌ర్ల స‌మ‌స్య కార‌ణంగా రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించాలా వ‌ద్దా అని ఎదురుచూస్తున్న `బంగార్రాజు`కు ఇప్పుడు బంగారం లాంటి అవ‌కాశం అభించింది. పోటీలో ఏ పెద్ద సినిమా లేదు.. సోలోగా బాక్సాఫీస్ ని రఫ్పాడించేయోచ్చు అని క్లారిటీ రావ‌డమే ఆల‌స్యం నాగార్జున రంగంలోకి దిగి రిలీజ్ డేట్ ముందు అనుకున్న 15 కాకుండా 14ని ఫిక్స్ చేశాడు.

ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ అనౌన్స్ చేసేశాడు. నాగార్జున న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `సోగ్గాడే చిన్ని నాయ‌న‌` చిత్నానికి `బంగార్రాజు` ప్రీక్వెల్ కావ‌డం... పైగా నాగ్‌, చైతూ క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంతే కాకుండా పోటిలో పెద్ద సినిమా అంటూ లేక‌పోవ‌డంతో సంక్రాంతికి ఒక్క‌డే అన్న‌ట్టుగా మారింది `బంగార్రాజు` ప‌రిస్థితి. ఇక ఈ మూవీతో పాటు మ‌రో తొమ్మిది చిత్రాలు వ‌చ్చేస్తున్నాయ‌ని హ‌డావిడి చేశాయి.  కానీ అందులో మూడు మాత్ర‌మే సంక్రాంతి బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైపోయింది.

`బంగార్రాజు` రిలీజ్ రోజే దిల్ రాజు సోద‌రుడి కుమారుడు ఆశిష్ రెడ్డి `రౌడీ బాయ్స్‌`తో రాబోతున్నాడు. దిల్ రాజు ఫ్యామిలీ వార‌సుడి సినిమా కావ‌డంతో కొంత ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశం వుంది. ఇక ఈ మూవీ త‌రువాత మ‌హేష్ బాబు మేల్లుడు గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న `హీరో` జ‌న‌వ‌రి 15న రాబోతోంది. ఇప్ప‌టికే డేట్ ప్ర‌క‌టించినా దీని ప్ర‌భావం పెద్ద‌గా వుండేలా క‌నిపించ‌డం లేదు.

ఇక ఇదే దారిలో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన `డీజే టిల్లు` కూడా జ‌న‌వ‌రి 14నే వ‌చ్చేస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ చిత్రం పై మాత్రం యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న ప‌రిధి మేర‌కు ప్ర‌భావాన్ని చూపించొచ్చు అంటున్నారు. ఈ సినిమాల త‌ర‌హాలోనే రాజ‌శేఖ‌ర్ `శేఖ‌ర్‌`, ఎంమ్మెస్ రాజు `7 డేస్ 6 నైట్స్‌`, క‌ల్యాణ్ దేవ్ సూప‌ర్ మ‌చ్చి వ‌చ్చేస్తున్నాం సంక్రాంతికే అని హ‌డావిడి చేసినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రిలీజ్ లు ఆపుకోవ‌డ‌మే మంచిద‌ని ఆగిపోయార‌ట‌.

 ఫైన‌ల్ గా సంక్రాంతి పోటీకి నాలుగు చిత్రాలు మాత్ర‌మే నిల‌వ‌డం.. అందులో `బంగార్రాజు` వుండ‌టంతో అస‌లు పోటీనే లేద‌ని ఈ ఫైట్ లో రారాజు ఒక్క‌డే అని అది `బంగార్రాజు` మాత్ర‌మేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. రియాలిటీ చూస్తే అదే నిజ‌మ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఏం జ‌ర‌గ‌నుందో తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News