నాగార్జున సినిమా లైన్లోకి వచ్చేసింది

Update: 2016-09-03 11:30 GMT
వరుసగా తెరలు వీడిపోతున్నాయి. రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న చాలా సినిమాలకు మోక్షం లభిస్తోంది. చాన్నాళ్లుగా వెయిటింగులో ఉన్న సినిమాలన్నీ ఒక్కసారిగా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంటూ బాక్సాఫీస్ బరిలోకి దిగేస్తున్నాయి. ఆ కోవలోనే నాగార్జున నిర్మించి.. నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ కూడా రేసులోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఈ నెల 16నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 8న నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వెన్షన్లో ఆడియో వేడుక చేయబోతున్నారు. సినీ ప్రముఖుల.. అభిమానుల సమక్షంలో ఈ వేడుకను పెద్ద ఎత్తున చేయడంతో పాటు.. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేయాలనుకుంటున్నాడు నాగ్.

ఈ నెల 16న నాని సినిమా ‘మజ్ను’తో పాటు నారా రోహిత్ మూవీ ‘శంకర’ కూడా రిలీజవుతున్నాయి. అయినా వాటికి పోటీగా ‘నిర్మలా కాన్వెంట్’ను రిలీజ్ చేయడానికే ఫిక్సయ్యాడు నాగ్. అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేసిన నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుంటే.. ఒకప్పటి బాలనటి శ్రియ కథానాయికగా నటించింది. ఆ మధ్య రిలీజైన ‘నిర్మలా కాన్వెంట్’ ట్రైలర్ బాగానే ఆసక్తి రేకెత్తించింది. ముందు ఇదేదో బాలల చిత్రం అనుకున్నారు కానీ.. ఇందులో కమర్షియల్ అంశాలు కూడా బాగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమైంది. నాగార్జున పాత్ర ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Tags:    

Similar News