ఉగాదికి నందులిస్తే.. తెలుగును గౌరవించినట్టే

Update: 2015-01-20 05:22 GMT
          ఉగాది రోజున నంది పురస్కారాల ప్రదానం అనే కాన్సెప్టు బావుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు పండుగను గౌరవిస్తూ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు బావుందంటూ సినీవర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినీ,టీవీ రంగాలకు సంబంధించిన పురస్కారాలను క్రమం తప్పకుండా ప్రదానం చేయాలన్న ఆలోచన బావుంది. నందులు ఇచ్చే రోజే ఎన్టీఆర్‌ సినీ జాతీయ పురస్కారం, ఇతర జాతీయ పురస్కారాల్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రశంసించదగ్గ నిర్ణయం. ప్రతియేటా డిసెంబర్‌ 21న నంది పురస్కారాల పత్రికా ప్రకటన వెలువడుతుంది. కొత్త సంవత్సరంలో జనవరి 16వరకూ ఎంట్రీల కోసం గడువు విధిస్తారు. ఫిబ్రవరిలో నంది కమిటీ ఎంట్రీలను పరిశీలించి పురస్కారాలకు ఎంపిక చేస్తుంది. ఎన్‌.టి.రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న నంది నాటకోత్సవాల్ని నిర్వహిస్తారు. పురస్కారాలు ప్రదానం చేస్తారు. అదే వేదికపై ఎన్టీఆర్‌ రంగస్థల పురస్కార ప్రదానం ఉంటుంది. అక్టోబర్‌ 15 టీవీ దినోత్సవాన టీవీ నందుల ప్రదానం జరుగుతుంది. సినీ, టీవీ రంగాలకు సంబంధించి 2012, 2013 సంవత్సరాలకు నందులు అందించాల్సి ఉంది. 2013కి నాటక నందుల్ని కూడా ఇవ్వాల్సి ఉంది.

        రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమిది. టీవీ నందులు అనంతపురంలో, నాటక నందుల్ని రాజమండ్రిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేమైనా ఇంతకాలం ఎలాంటి నందులు ఇచ్చినా దానికి హైదరాబాద్‌ వేదిక. కానీ ఇప్పుడు సీను మొత్తం మారిపోయింది. ఏపీలోనే సినిమా, టీవీ, నాటం అభివృద్ధికి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధమైనట్టేనని ఈ నందుల ప్రదాన కార్యక్రమం చెబుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి నందులపై ఇక తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. తెలంగాణ కళాకారులకు ప్రత్యేక వేదికను సిద్ధం చేసి వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ.. బలం పుంజుకుని అవార్డులు ఇవ్వడానికి టీ ప్రభుత్వం ఇప్పటికే సుముఖంగా ఉంది. ఏపీలో ఇచ్చే నందులు ఏపీ, తెలంగాణకు చెందిన తెలుగువారందరికీ వర్తిస్తాయా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే నందులన్నీ కేవలం డమ్మీలే అని కొట్టి పారేస్తున్నారు. ఇప్పుడు ఇంకేమంటారో?

Tags:    

Similar News