ఆ విషయం తెలుసు.. ఐనా 'ఓ బేబీ' తీశా

Update: 2019-07-01 09:16 GMT
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఓ బేబీ' చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుసగా విజయాలతో దూసుకు పోతున్న సమంతకు 'ఓ బేబీ' చిత్రం మరో విజయాన్ని ఆమె ఖాతాలో వేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం వస్తుందా అంటూ ఎదురు చూసేలా ఈ చిత్రం టీజర్‌ మరియు ట్రైలర్‌ చేశాయి. కొరియన్‌ మూవీ 'మిస్‌ గ్రానీ' చిత్రానికి రీమేక్‌ అయిన ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ సందర్బంగా రీమేక్‌ చేయడం వల్ల దర్శకులకు ఏమాత్రం ఉపయోగం ఉండదని.. సక్సెస్‌ అయితే మాతృక బాగుంది కనుక సక్సెస్‌ అయ్యిందని అంటారు.. ఫ్లాప్‌ అయితే మాతృకను చెడగొట్టారని అంటారు. అయినా కూడా మీరు మాత్రం ఈ చిత్రంను చేసేందుకు ముందుకు వచ్చారు. దీనికి గల కారణం ఏంటీ అంటూ ప్రశ్నించగా దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. రీమేక్‌ వల్ల కెరీర్‌ కు ఏమాత్రం ఉపయోగం ఉండదనే విషయం తనకు తెలుసని.. ఐతే ఒక మంచి సినిమా తీశాననే సంతృప్తి కలగాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని చేసినట్లుగా నందిని రెడ్డి చెప్పుకొచ్చింది.

ఈ చిత్రంను సమంత నా వద్దకు తీసుకు వచ్చిన సమయంలో కాస్త ఆలోచించాను. సినిమాను ఉన్నది ఉన్నట్లుగా దించకుండా ఒరిజినల్‌ ను 60 శాతం మాత్రమే తీసుకుని మిగిలినది తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా కథలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని మేము కామెడీ సినిమాగా ప్రమోట్‌ చేసినా కూడా దీని ట్రైలర్‌ చూసిన తర్వాత జనాలు ఇందులో ఎమోషన్‌ సీన్స్‌ కూడా ఉంటాయని ఆశిస్తున్నారు. అవును నిజంగానే ఈ చిత్రంలో ఎమోషనల్‌ సీన్స్‌ ఉంటాయి. ప్రివ్యూ చూసిన 200 మంది సినిమా పూర్తి అయిన తర్వాత కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఇది ఖచ్చితంగా అన్ని రకాల ఎమోషన్స్‌ ను ప్రేక్షకులకు కలిగిస్తుందని నందిని రెడ్డి చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News