అంటే.. నిర్మాతల ఆలోచనలను మార్చేసిందా..?

Update: 2022-06-07 15:30 GMT
ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు - స్టార్ హీరోలు నటించిన చిత్రాలు కూడా థియేట్రికల్ రన్ పూర్తవ్వకుండానే.. నెల తిరక్కుండానే ఓటీటీలో రిలీజ్ అవుతుండటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే వాటిల్లో రెండు పెద్ద సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రాలే ఉండటం గమనార్హం.

టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తున్న మైత్రీ మేకర్స్.. అల్లు అర్జున్ తో 'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని నిర్మించి ఘన విజయం అందుకున్నారు. అలానే మహేష్ బాబు తో 'సర్కారు వారి పాట' సినిమాని రూపొందించి మరో బ్లాక్ బస్టర్ ని తమ బ్యానర్ ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు చిత్రాలను గానూ మేకర్స్ ఫ్యాన్సీ అమౌంట్ ని అందుకున్నట్లు టాక్.

అయితే 'పుష్ప' 'సర్కారు వారి పాట' సినిమాలు రెండూ మూడు వారాల్లోనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కాబడ్డాయి. దీంతో ఇప్పుడు మైత్రీ టీమ్ నిర్మిస్తోన్న 'అంటే సుందరానికీ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వకముందే.. అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి.

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంటే సుందరానికి' సినిమా ఈ శుక్రవారం (జూన్ 10) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ సొంతం చేసుకుందని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన తర్వాత కేవలం మూడు వారాల్లోనే నాని సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందేమో అని టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రం ఏ ఓటీటీ వేదికతోనూ అలాంటి ఒప్పందాన్ని చేసుకోలేదని హీరో నాని పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవ్వదని ధృవీకరించారు.

దీనిని బట్టి మైత్రీ మూవీ మేకర్స్ వారు 'అంటే సుందరానికీ' ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో తమ ఆలోచనలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ కు ఓటీటీ స్ట్రీమింగ్ కు మధ్య కనీసం 8 వారాల గ్యాప్ ఉండాలనే సూచనలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనిపిస్తోంది. రానున్న రోజుల్లో సినిమాలన్నీ ఈ విధంగానే థియేట్రికల్ రన్ పూర్తైన తరువాతే ఓటీటీలోకి తీసుకొస్తారేమో చూడాలి.
Tags:    

Similar News