నాని..ఓ ఫ్రెండు.. ఓ సినిమా స్టోరీ

Update: 2016-06-16 18:30 GMT
ఆబ్లిగేషన్ మీద తాను సినిమాలు చేసే అవకాశమే లేదంటున్నాడు యువ కథానాయకుడు నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ తనను హీరోగా పరిచయం చేసి లైఫ్ ఇచ్చాడు కాబట్టే ‘జెంటిల్‌ మన్’ చేశానని అనుకుంటే పొరబాటని అతనన్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చెప్పిన కథ చెప్పినా నచ్చకపోవడంతో నో చెప్పానని.. దీంతో అతను తనతో మాట్లాడ్డమే మానేశాడని నాని వెల్లడించాడు.

‘‘నేను ఆబ్లిగేష‌న్‌‌ తో ఏ సినిమా చేయను. ఇందుకు ఓ ఉదాహ‌ర‌ణ చెబుతున్నాను. నాకొక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను డైరెక్ట‌ర్ కావాల‌నుకుంటున్నాడు. నాకొక క‌థ చెప్పాడు. అది నాకు న‌చ్చ‌లేదు. పోనీ స్నేహితుడే క‌దా సినిమా చేద్దామంటే అది క‌చ్చితంగా స‌క్సెస్ కాద‌ని తెలుసు. కాబ‌ట్టి ఆ సినిమా నేను చేయ‌లేదు. దీంతో అతను నాతో మాట్లాడ్డం మానేశాడు. త‌ర్వాత త‌నే అర్థం చేసుకుని మాట్లాడాడు. సినిమా అనేది వందల మంది కష్టం. కోట్లతో ముడిపడి ఉంటుంది. అలాంటి విషయాల్లో రిస్క్ చేయకూడదు. ‘జెంటిల్‌ మన్’ చేసేటపుడు కూడా నేనెక్క‌డ అబ్లిగేష‌న్ మీద  ఒప్పుకుంటానేమో అని ఇంద్ర‌గంటిగారు ‘నీకు న‌చ్చ‌క‌పోతే అస‌లు చేయ‌వ‌ద్దు’ అంటూ పదిసార్లు ఫోన్ చేసి చెప్పారు. ప‌ది మెసేజ్‌ లు పెట్టారు. ఐతే కథ వినగానే ఎగ్జైటయ్యాను కాబట్టే ఈ సినిమా చేశా’’ అని వెల్లడించాడు నాని.

రెండేళ్ల కిందట వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నపుడు కూడా తన జడ్జిమెంట్ విషయంలో సందేహాలేమీ రాలేదని.. ఆ ఫెయిల్యూర్ల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోయానని.. మంచి ఫలితాలందుకున్నానని నాని చెప్పాడు. ‘‘విజయాలతో నేర్చుకోలేని విషయాలు ఆ సినిమాలు నాకు నేర్పాయి. సక్సెస్ అయిన సినిమాల కోసం ఎంత కష్టపడ్డానో వాటికి కూడా అంతే శ్రమించా. ఒకట్రెండు సినిమాలు ఆడనంత మాత్రాన నేనేమీ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు’’ అన్నాడు.
Tags:    

Similar News