‘ఎంసీఏ’ కూడా ‘డీజే’ టైపేనా?

Update: 2017-12-26 15:30 GMT
దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంటూ అప్పట్లో ఊదరగొట్టేశారు. ఈ సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడిన వాళ్లపై ఎదురు దాడి చేశారు. కలెక్షన్ల విషయంలో గొప్పలు పోయారు. తీరా చూస్తే ఈ సినిమా ఫలితమేంటో రాజే స్వయంగా ఈ మధ్యే వెల్లడించాడు. ఈ సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్లకు ‘ఫిదా’ సినిమాతో న్యాయం చేశామని.. అందరూ రికవర్ అయిపోయారని రాజు చెప్పాడు. దీన్ని బట్టే ‘డీజే’ సినిమా హిట్ కాదని తేలిపోయింది. రాజు నిర్మాణంలో ఆ తర్వాత వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సైతం ‘డీజే’ తరహాలోనే అక్కడక్కడా బయ్యర్లకు కొంత నష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాజు ప్రొడక్షన్లో వచ్చిన ‘ఎంసీఏ’ కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘ఎంసీఏ’కు ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు రూ.30 కోట్లకు పైనే అమ్ముడయ్యాయి. నాని సూపర్ ఫాంలో ఉండటం.. చాన్నాళ్లుగా సరైన సినిమా లేక సినీ ప్రియులు అల్లాడిపోతుండటం.. భారీ స్థాయిలో రిలీజ్ చేయడం వల్ల ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా తొలి వారాంతంలో మంచి వసూళ్లే సాధించింది. ఐదు రోజుల్లో రూ.20 కోట్ల షేర్ మార్కును దాటింది. ఐతే క్రిస్మస్ రోజు వరకు పరిస్థితి బాగానే ఉంది కానీ.. ఈ రోజు వసూళ్లు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పుంజుకోవడం అంత సులువేం కాదు. ఇంకా రూ.10 కోట్లకు పైగా ఈ చిత్రం షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ వీకెండ్లో ‘ఒక్కక్షణం’ మంచి అంచనాలతో రిలీజవుతోంది. ‘ఎంసీఏ’ బాగా ఆడుతున్న బి-సి సెంటర్లలో సునీల్ సినిమా ‘2 కంట్రీస్’ కొంత మేర ప్రభావం చూపొచ్చు. మొత్తంగా చూసుకుంటే ‘ఎంసీఏ’ బయ్యర్ల పెట్టుబడిని రికవర్ చేయడం అంత ఈజీ కాదు. రాజు నుంచి వచ్చే తర్వాతి సినిమాతో బయ్యర్లకు ‘న్యాయం’ చేయక తప్పదేమో. అంటే ఇది కూడా ‘డీజే’ తరహా బ్లాక్ బస్టర్ అనుకోవాలేమో.
Tags:    

Similar News