రోహిత్-శౌర్య.. ఆ కెమిస్ట్రీ ఏంటి బాబోయ్

Update: 2016-09-09 13:32 GMT
‘జ్యో అచ్యుతానంద’ ఆడియో వేడుకలో నాగశౌర్య మాట్లాడుతూ.. ఈ సినిమాకు విడుదలకు ముందే రీమేక్ ఆఫర్లు వస్తున్నాయని.. ఐతే అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తుంటే మానుకోవాలని.. ఎందుకంటే అన్నదమ్ములుగా తాను.. నారా రోహిత్ కుదిరినట్లు ఇంకెవరూ కుదరరని.. తమ మధ్య కెమిస్ట్రీ అంత గొప్పగా పండిందని అన్నాడు. ఇలా చెబుతుంటే అతిశయోక్తి లాగా అనిపించింది కానీ.. తెరమీద చూస్తుంటే మాత్రం నిజంగానే వాళ్లిద్దరి జోడీ అంత చక్కగా కుదిరింది. రెజీనా లాంటి అందమైన హీరోయిన్ ఉన్నా సరే.. సినిమాలో ఆమె హైలైట్ కాలేదు. అన్నదమ్ములుగా రోహిత్-శౌర్యనే తెరను ఆక్రమించేశారు. వాళ్లిద్దరూ కలిసి సినిమాను తమ భుజాల మీద నడిపించారు.

సినిమాలో అసలు రోహిత్.. శౌర్య కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. అచ్యుత్.. ఆనంద్ పాత్రలు మాత్రమే కనిపించాయి. అంత బాగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారిద్దరూ. ఆరంభంలో కొన్ని సన్నివేశాలకే నిజంగా ఇద్దరు అన్నదమ్ముల్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అన్నదమ్ముల్లో సహజంగా ఉండే ఇగో.. జెలసీ.. అలాగే నిగూఢంగా ఉండే ప్రేమను వాళ్లిద్దరూ పలికించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రతి సన్నివేశంలోనూ వాళ్లిద్దరి కెమిస్ట్రీ చక్కగా పండింది. ఇక పతాక సన్నివేశంలో అయితే చెప్పనక్కర్లేదు. ఇద్దరూ పోటీపడి పడి అద్భుతంగా నటించారు. భావోద్వేగాలు అదుపు చేసుకోలేని స్థితిలో ఇద్దరూ కౌగిలించుకునే సీన్ సినిమాకు హైలైట్. ఆ సన్నివేశాన్ని ఫీలైన ఏ ప్రేక్షకుడికైనా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మొత్తంగా అన్నదమ్ములుగా రోహిత్-శౌర్య ఇద్దరూ గొప్పగా నటించి ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశారు.
Tags:    

Similar News