ప్ర‌ధాని పిలుపు కాజ‌ల్‌ కేనా.. రైతుల‌కు లేదా?

Update: 2019-05-30 15:10 GMT
నేడు న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉత్స‌వానికి ప‌లువురు బాలీవుడ్ - కోలీవుడ్ ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం అందింది. అయితే ఈ జాబితాలో అందాల చంద‌మామ కాజ‌ల్ కి చోటు ద‌క్కింది. అయితే త‌న‌కు ఆహ్వానం కాస్తంత లేటుగా అందింద‌ని చంద‌మామ చిన్న‌బోయింది. అంతేనా.. దిల్లీ నుంచి ఇన్విటేషన్ ఆల‌స్యంగా చేరుకుంద‌ని తాను చేర‌తానో లేదో అంటూ క‌ల‌త చెందుతూ పీఎంవో ఇండియా ఆఫీస్ కి ట్విట్ట‌ర్ ద్వారా సందేశం పంపింది కాజ‌ల్. ఆల‌స్యంగా ఆహ్వానం అంద‌డాన్ని టెర్రిబ్లీ బ్యాడ్!! అంటూ ఫీలైంది చంద‌మామ‌.

మొత్తానికి ఒక అరుదైన అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది. అస‌లింత‌కీ చంద‌మామ సందేశం ఏంటి? అంటే... ``డియ‌ర్ స‌ర్.. న‌రేంద్ర మోదీజీ.. ప్ర‌ధానిగా మీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కి ర‌మ్మ‌ని న‌న్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆహ్వానం అందుకోవ‌డం ఎంతో గౌర‌వం. మీ పాల‌న చ‌రిత్ర‌లో సాక్ష్యంగా నిలిచింది. దిల్లీ నుంచి మీ ఆహ్వానం నాకు ఆల‌స్యంగా చేరుకుంది. ఇది చాలా బ్యాడ్ అని ఫీల‌వుతున్నా. ఈసారి కూడా మీరు ఇంత‌కంటే ప‌వ‌ర్ ఫుల్ గా దేశ‌ప‌రిపాల‌న సాగించాలి`` అని సందేశం పంపింది.

ఇక‌పోతే ఈ సందేశానికి పీఎంవో నుంచి రిప్ల‌య్ లేదు కానీ.. కాజ‌ల్ అభిమానుల నుంచి ఆస‌క్తిక‌ర రిప్ల‌య్స్ వ‌చ్చాయి. ప్ర‌ధాని ఇన్విటేష‌న్ కేవ‌లం కాజ‌ల్ కేనా?  రైతుల‌కు ఆహ్వానం పంపారా? అంటూ ఒక అభిమాని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న వేశాడు. ద‌క్షిణాదిన మీరు ఓట‌మి పాలైనందుకు భ‌య‌ప‌డి రైతుల‌కు ఆహ్వానం పంప‌లేదా? అంటూ సూటిగా ప్ర‌శ్నించాడు.


Tags:    

Similar News