టాలీవుడ్లో ఈ రికార్డు నానీకే సొంతం

Update: 2023-04-11 13:20 GMT
నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'దసరా' అనేక రకాలుగా ప్రేక్షకులను, ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. నాని చివరి సినిమా 'అంటే సుందరానికీ' పట్టుమని పది కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. అయినా సరే.. 'దసరా' మీద 60 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇదే షాకింగ్ అంటే అంతకు 20 కోట్లు ఎక్కువకే బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ సంచలనం అనే చెప్పాలి. నాని లాంటి మిడ్ రేంజ్ హీరో సినిమాకు తొలి రోజు రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. మీడియం రేంజ్ సినిమాల విషయంలో అనేక కొత్త రికార్డులకు 'దసరా' తెర తీసింది. ఇది పక్కా మాస్ మూవీ కాగా.. ఎక్కువగా క్లాస్ సినిమాలకే పట్టం కట్టే అమెరికన్ ఆడియన్స్ 'దసరా'ను నెత్తిన పెట్టుకోవడం కూడా చర్చనీయాంశమే. కేవలం ప్రిమియర్స్‌తోనే ఈ చిత్రం 6 లక్షల డాలర్లు కొల్లగొట్టి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది.

రిలీజ్ తర్వాత కొంచెం డివైడ్ టాక్ వచ్చినా తట్టుకుని నిలబడ్డ 'దసరా' ఇప్పుడు ఏకంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. టాలీవుడ్‌కు 2 మిలియన్ డాలర్ మూవీలేం కొత్త కాదు. కానీ 'దసరా' ఈ క్లబ్బులో చేరడం మాత్రం పెద్ద విశేషమే. ఎందుకంటే టాలీవుడ్ చరిత్రలోనే ఒక కొత్త డైరెక్టర్ సినిమా అమెరికాలో 2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. పెద్ద పెద్ద స్టార్లకు కూడా లేని ఈ రికార్డు నాని సొంతమైంది. 'దసరా' 1సినిమా విజయంలో దర్శకుడి పాత్ర కీలకం అయినప్పటికీ.. ఈ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడంలో నానీదే కీలక పాత్ర. క్లాస్ హీరోగా ముద్ర ఉన్న నాని.. మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో 'దసరా' చూపించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా నాని రేంజ్ పెరిగిపోయింది. ఐతే ప్రస్తుతం నాని చేస్తున్నది పక్కా క్లాస్ మూవీ. మరి ఆ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర నాని ఏమేర సత్తా చూపిస్తాడన్నది ఆసక్తికరం.

Similar News