క‌న్న‌డ సినీఇండ‌స్ట్రీ వ‌ర్సెస్ డిప్యూటీ సీఎం!

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి శివ‌కుమార్ తో క‌న్న‌డ సినీప‌రిశ్ర‌మ వార్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.;

Update: 2025-03-03 10:53 GMT

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి శివ‌కుమార్ తో క‌న్న‌డ సినీప‌రిశ్ర‌మ వార్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా సినీప‌రిశ్ర‌మ ప్రముఖులు ఎవ‌రూ అటెండ్ కాక‌పోవ‌డంపై డిప్యూటీ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు. సినీ ప‌రిశ్ర‌మ ఉత్స‌వాల్లో పాల్గొనడంలో విఫలమయ్యారని ఉప ముఖ్య‌మంత్రి స్టార్ల‌ను విమర్శించారు.

అంతేకాదు .. స్క్రూను ఎక్కడ తిప్పాలో ప్రభుత్వానికి తెలుసు అని కూడా వ్యాఖ్యానించారు. న‌ట్లు, బోల్ట్ లు సెట్ చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆదివారం ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక స్పందిస్తూ, ``సినిమా పరిశ్రమ అంటే ఈ ప్ర‌భుత్వానికి ఇష్టం లేదు`` అని వ్యాఖ్యానించారు. ``ప‌రిశ్ర‌మ‌ను గౌరవంగా చూడండి. సినీ కార్మికులు మీ పార్టీ కార్యకర్తలు కాదు. నటులను గౌరవించడం నేర్చుకోండి. సమాజంలోని ప్రతి ఒక్కరూ మీ ఇష్టానుసారం నడుచుకోవాలని ఆశించవద్దు..`` అని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వ్యాఖ్యానించారు.

జేడి(ఎస్‌)కి చెందిన కేంద్ర పరిశ్రమలు, ఉక్కు మంత్రి హెచ్‌డి కుమారస్వామి వ్యాఖ్యానిస్తూ..``ప్రభుత్వాన్ని నడపడానికి శివకుమార్ అతడి పార్టీ 138 సీట్లతో ఆశీర్వాదం అందుకుంది. ``ఎవరి నోళ్ళు, బోల్ట్‌లను బిగించడానికి కాదు. అలాంటి ఉద్యోగం చేయడానికి సమాజంలో చాలా మంది ఉన్నారు. మీరు ప్రభుత్వాన్ని నడపండి`` అని ఉప ముఖ్య‌మంత్రిపై కౌంట‌ర్ వేసారు.

ఇంత‌లోనే డిప్యూటీ సీఎం శివకుమార్‌ను రక్షించేందుకు ఆయ‌న‌ సహచరులు రంగంలోకి దిగారు. శివ‌కుమార్ వ్యాఖ్య‌ల‌తో మ‌రింత డ్యామేజ్ జ‌ర‌గ‌కుండా కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. ``మేకేదాటు ప్రాంతం పాదయాత్రలో సినీ నటులు తనతో కలసిరాకపోవడంపై శివ‌కుమార్ బ‌హిరంగంగానే వేదన చెందారు. పరిశ్రమతో ఆయనకు ఉన్న సామీప్యమే ఆయన ఆ వ్యాఖ్యలు చేయడానికి దారి తీసింది`` అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి అయిన నటి ఉమాశ్రీ వ్యాఖ్యానించారు. అయితే ఉడిపిలో శివకుమార్ మాత్రం తాను `నిజం మాత్రమే మాట్లాడాను` అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

Tags:    

Similar News