పవన్ కళ్యాణ్ - ఛావా.. బన్నీ వాసు ఏమన్నారంటే..

ఇటీవల చావా సినిమా తెలుగు రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొనగా జనసేన సభ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-03-03 14:00 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు జనసేన పార్టీకి సంబంధించి అప్పుడప్పుడు పలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సోషల్ మీడియా డిజిటల్ విభాగాన్ని ఆయనే హ్యాండిల్ చేశారు. ఇక ఇప్పుడు సభ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల చావా సినిమా తెలుగు రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొనగా జనసేన సభ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ దినోత్సవ సభపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ వేడుకను చారిత్రకంగా నిలిచేలా ప్లాన్ చేస్తూ, జనసేన పార్టీ నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఈ సభ జరుగనుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

ఇక బన్నీ వాసు సభ గురించి మాట్లాడుతూ..“ఇది కేవలం సభ కాదు, ఒక చరిత్ర. ఈ సభ ప్రజలకు, కార్యకర్తలకు ఎంతో స్పూర్తినిచ్చే విధంగా ఉంటుందని నా విశ్వాసం. నాకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. వంద శాతం నాకిచ్చిన బాధ్యతలను పూర్తి చేస్తాను. జనసేన పార్టీకి ఈ సభ ఎంతో ముఖ్యమైనది, దీన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తాను” అని బన్నీ వాసు అన్నారు.

అదే విధంగా అవకాశం దొరికితే ఛావా సినిమాను పవన్ కళ్యాణ్ కు చూపించేందుకు ప్రయత్నం చేస్తాను అని అన్నారు. ప్రస్తుతం ఆయన సనాతన ధర్మ విషయంలో ఏ విధంగా కొనసాగుతున్నారో అందరికి తెలిసిందే. కాబట్టి ఇలాంటి సినిమాను తాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను అని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని బన్నీ వాసు వివరణ ఇచ్చారు.

శంబాజి మహరాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక తెలుగులో ఈ నెల 7న గీతా డిస్ట్రిబ్యూషన్ లో బన్నీ వాసు విడుదల చేయబోతున్నారు. ఇక పవన్ ఆ మధ్య మహారాష్ట్ర ఎన్నికల సమయంలో బిజేపికి మద్దతుగా ప్రచారం చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి కూడా గొప్పగా చెప్పారు. మరి ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కు చూపిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News