డీజే టిల్లు రాధిక జోరు పెంచేసిందిగా

Update: 2022-04-22 15:30 GMT
వెర్స‌లటైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన 'మెహ‌బూబా' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది క‌న్న‌డ సోయ‌గం నేహా శెట్టి . ఆకాష్ పూరి హీరోగా న‌టించిన ఈ చిత్రం నేహాకు ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఆ త‌రువాత చేసిన 'గ‌ల్లీ రౌడీ' ఫ‌ర‌వాలేద‌నిపించింది. అయితే సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌తో చేసిన 'డీజే టిల్లు' మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి నేహా శెట్టి కెరీర్ ని స‌మూలంగా మార్చేసింది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ క‌మ‌ర్శియ‌ల్ యాడ్ ల‌తో పాటు క్రేజీ చిత్రాల్లో న‌టించే అవ‌కాశాన్ని అందించింది.

రాధిగక‌గా 'డీజే టిల్లు'లో నేహా శెట్టి పోషించిన పాత్ర‌కు మంచి గుర్తింపు ల‌భించింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ భారీ ఆఫ‌ర్లు నేహాని వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం కార్తికేయ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది నేహాశెట్టి. సైమా, ఆహా వంటి పుర‌స్కార వేడుక‌ల్లో బెస్ట్ డెబ్యూ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా అవార్డులు సొంతం చేసుకున్న లౌక్యా ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నం. 3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ర‌వీంద్ర బెన‌ర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌ల‌ర్ ఫొటో, తెల్ల‌వారితే గురువారం వంటి విభిన్న చిత్రాల త‌రువాత ఆయ‌న నిర్మిస్తున్న మూడ‌వ చిత్ర‌మిది.

సి. యువ‌రాజ్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి క్లాక్స్ ద‌ర్శ‌కుడు. విబిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శుక్ర‌వారం లాంఛ‌నంగా పూజా కార్యక్ర‌మాల‌తో ప్రారంభించారు. ఇదే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన  కాన్సెప్ట్ పోస్ట‌ర్ కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ శుక్ర‌వారం నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. హీరో కార్తికేయ‌, హీరోయిన్ నేహా శెట్టిల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ క్లాప్ నివ్వ‌గా, హీరో కార్తికేయ వైఫ్ లోహిత కెమెరా స్విఛాన్ చేశారు. 'ఉప్పెన‌' ఫేమ్ బుచ్చిబాబు సాన స్క్రిప్ట్ అందించారు.  

తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, యానాం ప‌రిస‌రాల్లో ఏక ధాటిగా షూటింగ్ చేయ‌నున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. స్వ‌ర్గీయ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గారు రాసిన ఓ పాట‌ని ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారు. ఆయ‌న రాసిన చివ‌రి పాట ఇదే. డ్రామా ప్ల‌స్ కామెడీ జాన‌ర్ లో సాగే చిత్ర‌మిది. ప్ర‌తీ ఒక్క‌రికీ కొత్త‌గా.. అంద‌రికంటే భిన్నంగా బ్ర‌త‌కాల‌ని వుంటుంది. కానీ ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతుంటారు.

అయితే ఎవ‌రు ఏమ‌నుకున్నా త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా జీవిస్తూ త‌న‌దైన దారిలో వెళ్లే ఓ యువ‌కుడి క‌థ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  అజ‌య్ ఘోష్‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ఆటో రామ్ ప్ర‌సాద్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, ఎల్బీ శ్రీ‌రామ్‌, సుర‌భి ప్ర‌భావ‌తి, కిట్ట‌య్య‌, అనితానాథ్‌, దివ్య‌నార్ని త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
Tags:    

Similar News