రాజీనామా చేసి దిద్దుకోలేని తప్పు చేసిన మెగా బ్రదర్?

Update: 2021-10-11 09:30 GMT
అందరూ అన్నింట్లోనూ రాణించలేరు. ఈ విషయాన్ని మెగా బ్రదర్స్ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. సినిమాల్లో వారికి తిరుగులేని క్రేజ్ ఉందనే విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. తమకున్న ఇమేజ్ కు హ్యాపీగా ఫీలై..తమ దారిన తాము బతికేస్తే ఎవరికి ఎలాంటి సమస్యా ఉండదు. వారు సినిమాలు చేయటం.. ప్రేక్షకులు.. అభిమానులు ఆ సినిమాల్నిచూసి ఎంజాయ్ చేయటం.. విన్ టు విన్ అన్నట్లుగా ఉన్నప్పుడు ఎలాంటి నొప్పులకు అవకాశం లేదు. సమస్య అంతా ఎప్పుడు వస్తుందంటే.. నలుగురు మధ్యలోకి వచ్చినప్పుడు.. ప్రజాసేవ చేయాలని డిసైడ్ అయినప్పుడు. ప్రజల్లో ఉన్న వాడు ఎంత శ్రీరామ చంద్రుడైనా.. ఏదో ఒక మాట అనకుండా ఉండటం కుదరదు. ఎవరో దాకా ఎందుకు అంత పెద్ద శ్రీరామచంద్రుడే.. ఉత్తి పుణ్యానికి మాట అనేశాడు కదా?

శ్రీరామచంద్రుడితే తప్పని తిప్పలు.. మెగా బ్రదర్స్ కు మాత్రం ఉండకుండా ఉంటాయా చెప్పండి? ‘మా’ ఎన్నికల వేళ.. మిగిలిన మెగా బదర్స్ కు భిన్నంగా నాగబాబు ఎలా వ్యవహరించారో తెలిసిందే. మెగా కాంపౌండ్ మద్దతు అంతా ప్రకాశ్ రాజ్ కు ఉందన్నాడు. తమ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. తమపై చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించారు. ఎన్నికలు జరిగాయి.. ఫలితం ఓటమని తేలింది. ఇలాంటి వేళలో.. ఓటమికి కారణాలు వెతకాలి? ఆ తప్పుల్ని పూడ్చుకొని విజయం దిశగా అడుగులు వేయాలే తప్పించి.. భావోద్వేగానికి గురై.. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

గెలవాలంటే ముందు బరిలో నిలవాలన్న విషయాన్ని నాగబాబు ఎలా మిస్ అయ్యారు? ఒకవేళ.. వైరిపక్షం వారు తొండి ఆట ఆడుతున్నారనే అనుకుందాం. అప్పుడేం చేయాలి? ఫలానా తప్పులు చేయాలి? ఇలాంటివి మంచిది కాదు. ఇలాంటి వారితో నేను ఆట ఆడలేను.. గుడ్ బై అని అనేయాలి. లేదంటే.. ఆటలోకి దిగిన తర్వాత గెలుపు మీదనే ఫోకస్ చేయాలే తప్పించి.. మిగిలినవి పట్టించుకోకూడదు. లోకం ఎప్పుడు విజేత మాటల్నే వింటుంది కానీ.. పరాజితుడి మాటల్ని పట్టించుకోదు. ఈ చిన్న లాజిక్ నాగబాబు ఎందుకు మిస్ అయ్యారు?

ఒకవేళ ప్రకాశ్ రాజ్ గెలిచి ఉంటే.. ఆ క్రెడిట్ అంతా మెగా క్యాంప్ తీసుకోవటానికి ఏ మాత్రం మొహమాట పడే వారు కాదు కదా? అలాంటప్పుడు గెలిచినప్పుడు సంతోషానికి గురై.. ఓడినప్పుడు విపరీతమైన వేదనకు గురి కావాల్సిన అవసరంలేదన్నది మర్చిపోకూడదు. అందుకే.. గెలిచినప్పటి కంటే ఓటమి ఎదురైనప్పుడు మరింత బలంగా నిలిస్తే.. వారికి మద్దతుగా నిలిచిన వారు సైతం స్థైర్యంగా ఉంటారన్నది మర్చిపోకూడదు. సో.. గెలవటానికి ముందు నిలవాన్న ప్రాధమిక సత్యాన్ని మెగా బ్రదర్ త్వరగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.



Tags:    

Similar News