అల్లు అర్జున్ శాటిలైట్ స్టార్..!

Update: 2022-04-01 15:30 GMT

సౌత్ స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్.. ఇప్పుడు సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. ‘పుష్ప ది రైజ్’ సినిమాతో హిందీ మార్కెట్ లో ఊహించని విజయాన్ని అందుకుని బాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా వంద కోట్లకు పైగా వసూళ్ళు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పుష్పరాజ్ గా బన్నీ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఉత్తరాది జనాలంతా ఇప్పుడు 'పుష్ప' పార్ట్-2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తాజాగా 'పుష్ప' సినిమా విజయానికి కారణాలు ఏంటనేది విశ్లేషించారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మాస్ సినిమాలు రావడం లేదనీ.. ఇప్పుడు ఆ లోటు ‘పుష్ప’ తీర్చిందనీ.. అందుకే అంత పెద్ద విజయం సాధించిందని కరణ్ జోహార్ అభిప్రాయ పడ్డారు.

‘కేజీఎఫ్’ సినిమా ఘనవిజయం సాధించడానికి అదే కారణమని దర్శక నిర్మాత అన్నారు. 70స్ లో హిందీలో మాస్ సినిమాలు వచ్చేవనీ.. ఆ తర్వాత వాటి వైపు పెద్దగా ఎవరూ చూడకపోవడంతో బాలీవుడ్ ప్రయాణం వేరేలా సాగిందని కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ కూడా మాస్ దిశగా ఆలోచనలు చేయాలని అభిప్రాయపడ్డారు.

‘పుష్ప’ కంటే ముందు హిందీలో అల్లు అర్జున్ శాటిలైట్ స్టార్‌ గా వెలుగొందాడని కరణ్ పేర్కొన్నారు. బన్నీ నటించిన తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ కాబడి టీవీ మరియు యూట్యూబ్ ఛానళ్లలో అద్భుత విజయాలు దక్కాయని కరణ్ జోహార్ గుర్తు చేశారు.

అందుకే స్ట్రెయిట్ గా హిందీలో సినిమాలు రిలీజ్ అవ్వకపోయినా.. డబ్బింగ్ సినిమాలతో అల్లు అర్జున్ స్టార్‌డమ్ ‘శాటిలైట్ స్టార్’ అనే కేటగిరీలో పెరిగిందని కరణ్ చెప్పారు. ఈ క్రమంలో అతను ఇప్పుడు 'పుష్ప' వంటి రా అండ్ రస్టిక్ మూవీ చేయడంతో ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారని అన్నారు.

ఇకపోతే కరణ్ జోహార్ ఇటీవల కాలంలో తెలుగు చిత్రాలను మరియు సౌత్ స్టార్లను బాలీవుడ్ లో ఎక్కువగా ప్రమోట్ చేస్తాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'లైగర్' చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు కరణ్. త్వరలో అఖిల్ అక్కినేనితో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News