బండ్ల విజయాన్ని ఎవరు ఆపలేరు

Update: 2021-09-27 14:30 GMT
మా ఎన్నికల్లో నటుడు బండ్ల గణేష్‌ సొంతంగా జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన మొదట ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ లో ఉన్నప్పటికి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చేశాడు. సొంతంగా తనకున్న గుర్తింపు.. మద్దతుతో జనరల్‌ సెక్రటరీగా పోటీ చేసేందుకు సిద్దం అయ్యాడు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్‌ కు మెగా అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకుల నుండి కూడా మద్దతు ఉంది. అయితే ఆయనకు మా సభ్యుల నుండి ఎంత వరకు మద్దతు ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. మా సభ్యుల్లో ఎక్కువ శాతం ఈయనకు మద్దతు ఇస్తారనే నమ్మకం కొందరు వ్యక్తం చేస్తున్నారు. సోలోగా పోటీ చేయడం వల్ల ఈయనకు కలిసి వచ్చే అంశం అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో బండ్ల గణేష్ తాజాగా తన నామినేషన్ ను మా ఆఫీస్‌ లో ఎన్నికల అధికారికి సమర్పించారు.

ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలను అందజేసిన తర్వాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ.. 28 ఏళ్ల క్రితం పెద్దలు కూర్చుని మా అసోషియేషన్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు చేసిన ప్రతి అధ్యక్షుడు కూడా బాగానే చేశారు. గత ప్రెసిడెంట్‌ ను బలవంతంగా దించేశారు. ఆయన కూడా మా కోసం బాగానే చేశారు. కొందరు సభ్యులు మా సభ్యులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మా సభ్యుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం మన స్టార్స్ ను తీసుకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించి వంద మంది సభ్యులకు ప్లాట్లు ఇప్పిస్తాను అంటూ బండ్ల గణేష్ హామీ ఇచ్చాడు.

నేను మా బిల్డింగ్ కట్టించలేను... ప్రస్తుత పరిస్థితుల్లో మా కు ఉన్న ఆఫీస్ సరిపోతుంది. ఛార్మినార్ కట్టిస్తా.. మరేదో కట్టిస్తా అంటే నమ్మడానికి లేదు. అవన్ని అబద్దపు మాటలు. ప్రస్తుతం మా ఆఫీస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. బండ్ల గణేష్ విజయాన్ని ఎవరు ఆపలేరు. నా వెనుక ఎవరు ఉన్నారో మీకు తెలియదు. ఇంతకు ముందు చేసిన వారు తప్పులు చేశారు అని నేను అనడం లేదు. వారు ఏం చేశారో మీ అందరికి తెలుసు. కనుక నేను ఖచ్చితంగా మా సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తాను అన్నాడు.

ఇక పవన్‌ వ్యాఖ్యలు.. ఆ తర్వాత మంత్రులు చేసిన వ్యాఖ్యల గురించి స్పందించాల్సిందిగా మీడియా మిత్రులు అడిగిన సమయంలో ఇప్పుడు వాటి గురించి మాట్లాడను... ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఆ విషయాల గురించి తన అభిప్రాయంను చెప్తాను అంటూ బండ్ల చెప్పుకొచ్చాడు. ఎన్నికల ముందు ఆ విషయమై స్పందించడం వల్ల వివాదాస్పదం అవ్వడం ఇష్టం లేక బండ్ల ఆ విషయాలను స్కిప్‌ చేశాడు. ఇక తన వెనుక ఎవరు ఉన్నారో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేసిన బండ్ల ఇంతకు ఎవరు ఉన్నది మాత్రం చెప్పలేదు. ఎన్నికల వరకు అయినా తన వెనుక ఉన్నది ఎవరు అనేది ఆయన చెప్తాడేమో చూడాలి.
Tags:    

Similar News