త్రిషను తీసుకొచ్చేవారే లేరా?

Update: 2022-02-26 08:41 GMT
త్రిష .. రెండే అక్షరాలు .. కానీ తెలుగు తెరపై ఈ బ్యూటీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ కోలీవుడ్ సుందరి ప్రశాంత్ హీరోగా చేసిన 'జోడీ' అనే సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలిగా చిన్న పాత్రను పోషించింది. ఆ సినిమా చూసినవారికి త్రిష గుర్తు కూడా ఉండదు. కానీ తన నాలుగో సినిమానే ఆమె స్టార్ హీరో విక్రమ్ సరసన చేసింది. త్రిష ఎంత  ఫాస్టుగా అవకాశాలను అందుకుంటుందనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తరువాత 'వర్షం' సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించింది.

ఇక ఎన్ని వర్షాలు కురిసినా కుర్రాళ్ల హార్ట్ వాల్ పై ఉన్న ఆమె పోస్టర్ మాత్రం నానిపోలేదు .. చిరిగిపోలేదు. అంతగా ఆమె తన గ్లామర్ తోను .. నటనతోను ఇక్కడి ప్రేక్షకుల మనసులను పెనవేసుకుపోయింది. అటు తమిళంలోను .. ఇటు తెలుగులోను ఎడా పెడా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అక్కడా .. ఇక్కడా కూడా స్టార్ హీరోలతోనే జోడీ కట్టేసింది. ఎవరి పక్కన కనిపిస్తే వారితో 'జోడీ అదిరింది' అనిపించింది. తమిళంలో రజనీ మొదలు .. తెలుగులో చిరంజీవి మొదలు అందరి స్టార్ హీరోలతోను ఆడిపాడేసింది.

త్రిష అదృష్టం ఏమిటంటే ఆమె చేసిన సినిమాల్లో చాలావరకూ హిట్లు ఉండటమే. ఆమె చేసిన పాత్రలపై ఆమెదైన ప్రత్యేకమైన ముద్ర ఉండటమే. అందువల్లనే తెలుగు ప్రేక్షకులు ఆమెను ఇంకా మరిచిపోలేకపోతున్నారు. ద్విభాషా చిత్రమైన 'నాయకి' సినిమాను పక్కన పెడితే, 2015లో బాలకృష్ణ సరసన ఆమె చేసిన 'లయన్' తెలుగులో ఆమె చివరి సినిమాగా చెప్పుకోవాలి. అప్పటి నుంచి ఆమె ఇటు వైపు తిరిగి చూస్తే ఒట్టు. తదేక దీక్షతో తమిళంలో మాత్రమే వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది.

తమిళంలో నాయిక ప్రధానంగా ఆమె చేసిన 'రాంగి' .. 'గర్జనై' విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇక మరో రెండు మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమె చాలా కాలం క్రితం ఓకే చేసినవే. కొత్తగా ఆమె సైన్ చేసిన ప్రాజెక్టుల వివరాలు మాత్రం తెలియడం లేదు. తెలుగులో అనుష్క సినిమాల సంఖ్యను పూర్తిగా తగ్గించేసింది. తెలుగులో చేయడానికి నయనతారకి కుదరడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ త్రిష పేరు వినిపించడం లేదు. త్రిషను ఎవరూ పిలవడం లేదా? ఆమె అలిగి చేయడం లేదా? అనేదే అభిమానులకు అర్థం కావడం లేదు.    
Tags:    

Similar News