ఎన్టీఆర్ ఆ జాగ్రత్తలు తీసుకుంటాడా

Update: 2017-03-18 06:39 GMT
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టేశాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో.. జూనియర్ విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి 'జై లవ కుశ' అనే టైటిల్ దాదాపు ఖాయమైనట్లే. అయితే.. ఈ టైటిల్ విషయంలోనే కొన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి.

'లవ కుశ' అంటే సీనియర్ ఎన్టీఆర్ చేసిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ టైటిల్. అది గుర్తొచ్చేలాగే 'జై లవ కుశ' టైటిల్ పెట్టారనడంలో సందేహం లేదు. అయితే.. క్లాసిక్ చిత్రాల్లోని పాటలను వాడుకోవడం వేరు.. ఏకంగా టైటిల్ నే పట్టుకొచ్చేయడం వేరు. ఇదేమీ అంత తేలికైన విషయం కాదు. ఇలా పాత సినిమా టైటిల్స్ ను ఉపయోగించుకోవడంలో తెలుగు సినిమాలకు గొప్ప ట్రాక్ రికార్డ్ లేదు. మాయాబజార్ చిత్రాన్ని.. సామాజిక కథాంశంగా మార్చి.. అదే టైటిల్ పై దాసరి తెరకెక్కించారు. అయితే.. ఇది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.

కె. విశ్వనాథ్ కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టిన శంకరాభరణం లాంటి ఎవర్ గ్రీన్ టైటిల్ ని.. కోన వెంకట్ ఓ కిడ్నాప్ డ్రామా కోసం ఉపయోగించినా వర్కవుట్ కాలేదు. ఈ వరుసలో మిస్సమ్మ టైటిల్ పై భూమిక చేసిన మూవీ ఒక్కటే హిట్ అయింది. ఇప్పుడు యంగ్ టైగర్ ఏకంగా.. తాతయ్య సినిమా టైటిల్ కే ఫిక్స్ అయ్యాడు. కమర్షియల్ గా ఆకట్టుకోవడం కోసం టైటిల్ తీసుకొచ్చేసినంత మాత్రాన.. ఆ ఒక్క పాయింట్ తో జనాలు కనెక్ట్ అయిపోరనేందుకు పై ఉదాహరణలే సాక్ష్యం. మరి జూనియర్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News