ఎన్టీఆర్ స్టామినా ఏంటో ఇప్పుడు తెలుస్తోంది

Update: 2016-07-08 07:51 GMT
హీరోగా మూడో సినిమాకే కలెక్షన్ల మోత మోగించిన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఆది’ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత ‘సింహాద్రి’లో ఎంతటి ప్రకంపనలు రేపాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. చాలా చిన్న వయసులోనే శిఖరంలాగా ఎదిగిపోయాడు ఎన్టీఆర్. అప్పట్నుంచి తారక్ ప్రతి సినిమాకూ అంచనాలు ఆకాశాన్నంటడం మొదలుపెట్టాయి. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో ఎన్టీఆర్ సక్సెస్ కాలేకపోయాడు. అప్పుడప్పుడూ హిట్లయితే వచ్చాయి కానీ.. ఏవి కూడా ‘సింహాద్రి’ స్థాయిని అందుకోలేకపోయాడు. ఐతే ఎన్టీఆర్ కు విశేషమైన మాస్ ఫాలోయింగ్ ఉండటం మాత్రం వాస్తవం.

కానీ ఒకప్పుడు ఎన్టీఆర్ కంటే తక్కువ అనుకున్న వాళ్లు.. అతడి తర్వాత హీరోలుగా పరిచయమైన వాళ్లు గత కొన్నేళ్లలో అతణ్ని దాటి ముందుకెళ్లిపోయారు. అతడి కంటే పెద్ద రికార్డులు సాధించారు. సినిమాల ఎంపికలో తప్పిదాల వల్ల.. వైవిధ్యమైన పాత్రలు - సినిమాలు ఎంచుకోకపోవడం వల్ల ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా అనుకున్న స్థాయిలో పెరగలేదు. కానీ గత రెండేళ్లలో పరిస్థితి మారింది. ‘టెంపర్’ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. ఆసక్తికరమైన ప్రాజెక్టులు సెట్ చేస్తూ సరైన ట్రాక్ లో నడుస్తున్నాడు తారక్. ‘జనతా గ్యారేజ్’ అన్ని రకాలుగా అద్భుతంగా కుదిరిన సినిమా. అటు ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాదు.. సామాన్య ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద చాలా అంచనాలున్నాయి. ఈ సినిమా మీద జనాల్లో ఎంత ఆసక్తి ఉందనేది.. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజైనపుడు.. లేటెస్టుగా టీజర్ రిలీజైనపుడు అందరికీ అర్థమైంది.

కేవలం 6 గంటల్లోనే ఈ టీజర్ కు మిలియన్ వ్యూస్ రావడమంటే మాటలు కాదు.. ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఏ టీజర్ కూ రానన్ని లైకులు కూడా తెచ్చుకుంది గ్యారేజ్ టీజర్. ఎన్టీఆర్ స్టామినా ఏంటో చెప్పడానికి ఇవే రుజువు. ఇప్పటికే 23 లక్షల మంది దాకా ఈ టీజర్ చూశారు. ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఎప్పుడూ తక్కువ కాదు. కాకపోతే సరైన సినిమా పడకపోవడం వల్ల అతడి ఫాలోవర్లలో అంత ఉత్సాహం లేకపోయింది. ఐతే ఇప్పుడు సరైన ప్రాజెక్టులు సెట్ చేస్తూ.. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఉత్సాహం తీసుకొచ్చి.. తన సినిమాల మీద ఆసక్తి పెంచుతుున్నాడు తారక్. ‘జనతా గ్యారేజ్’ అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా ఈ సినిమా నిలవడం ఖాయం.
Tags:    

Similar News