రిలీజ్ ట్రైలర్: ఇది 'పక్కా కమర్షియల్' సినిమానే..!

Update: 2022-06-29 13:21 GMT
మాచో స్టార్ గోపీచంద్ మరియు దర్శకుడు మారుతి దాసరి కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. ఇందులో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

'పక్కా కమర్షియల్' చిత్రం జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరికొన్ని గంటల్లో యూఎస్ఏ ప్రీమియర్స్ పడతాయనగా.. తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

'పాతికేళ్ల తర్వాత బ్లాక్ కోటు వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్ ఉండాలి..' అని రాశీ ఖన్నా చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. గోపీచంద్ ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్.. మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటుగా అన్ని కమర్షియల్ హంగులు జోడించి 'పక్కా కమర్షియల్' గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఈ ట్రైలర్ తెలియజేస్తోంది.

ఇందులో గోపీచంద్ లాయర్ గా చాలా స్టైలిష్ గా కనిపించారు. రాశీ ఖన్నా ఒక సీరియల్ ఆర్టిస్టుగా మరియు లాయర్ గా అలరించింది. గోపీచంద్ తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.

చిత్ర శుక్ల - శియా గౌతమ్ ప్రత్యేక పాత్రల్లో మెరిసారు. రావు రమేష్ - ప్రవీణ్ - సప్తగిరి - శ్రీనివాస్ రెడ్డి - వైవా హర్ష - జబర్దస్త్ వేణు - చమ్మక్ చంద్ర - రఘు వంటి భారీ తారాగణం ఇందులో భాగమయ్యారు.

అన్నీ కమర్షియల్ గా ఆలోచించే హీరో.. డబ్బు తీసుకొని ఎలాంటి తప్పు చేసినవాడికైనా కోర్టులో శిక్ష పడకుండా చూస్తుంటాడు. న్యాయాన్ని కాపాడుకోవడానికి కన్న తండ్రే అతనిపై పోరాడినట్లు మొదటి ట్రైలర్ లో చూపించారు. అయితే ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ లో అర్థమయ్యిందా అంటూ సత్యరాజ్ పాత్రలో మరో కోణాన్ని చూపించారు.

'జయం' 'నిజం' 'వర్షం' అంటూ గోపీచంద్ విలన్ గా నటించిన సినిమాల పేర్లు పలకడం.. వంశీ - వాసు - అరవింద్ అంటూ నిర్మాతల పేర్లు ప్రస్తావించడంలో మారుతి మార్క్ కనిపిస్తుంది. తండ్రీకొడుకులకు విడాకులు విప్పించండి అని రాశీ కోర్టులో వాదించడం నవ్వు తెప్పిస్తుంది.

ఓవరాల్ గా స్టైలిష్ యాక్షన్ తో ఫన్నీ డైలాగ్స్ తో కూడిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఇదొక పక్కా కమర్షియల్ సినిమా అని సూచిస్తోంది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించగా.. ఎస్బీ ఉద్ధవ్ ఎడిటింగ్ చేశారు. ఆర్ రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. SKN సహ నిర్మాతగా వ్యవహరించారు. 'పక్కా కమర్షియల్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Full View

Tags:    

Similar News