మోదీ బ‌యోపిక్‌.. సుప్రీంలో పంచాయితీ!!

Update: 2019-04-12 10:33 GMT
ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్ లు రిలీజ్ చేయ‌కూడ‌దా? ఈ ప్ర‌శ్న‌కు ఇంత‌వ‌ర‌కూ కోర్టుల ప‌రిధిలోనే స‌రైన ఆన్స‌ర్ లేనేలేదు. అదంతా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ (ఈసీ) చూసుకుంటుంది అంటూ అత్యున్న‌త న్యాయ‌స్థాన‌లే వ్యాఖ్యానించ‌డం ఇదివ‌ర‌కూ సంచ‌ల‌న‌మైంది. విలువైన కోర్టు స‌మ‌యాన్ని వృధా చేస్తున్నార‌ని కోర్టుల్లో త‌ప్పు బ‌ట్టిన సంద‌ర్భం ఉంది. కార‌ణం ఏదైనా మోదీ బ‌యోపిక్ గా చెబుతున్న‌ `పీఎం న‌రేంద్ర మోదీ` చిత్రం ఇప్ప‌ట్లో రిలీజ‌వుతుందా.. అవ్వ‌దా? అన్నది తేలేట్టు లేదు. రిలీజ్ పై పూర్తి సందిగ్ధ‌త నెల‌కొంది.

ఇప్ప‌టికే ఈ సినిమా రిలీజ్ విష‌య‌మై చిత్ర నిర్మాత‌లు ర‌క‌ర‌కాలుగా కోర్టులో పోరాడుతున్నారు. ఇటీవ‌లే సినిమా రిలీజ్  కి  లైన్ క్లియ‌ర్ అయ్యింద‌ని - ఏప్రిల్ 11న సినిమాని రిలీజ్ చేస్తున్నామని క‌థానాయ‌కుడు వివేక్ ఒబేరాయ్ - ద‌ర్శ‌కుడు ఒమంగ్ కుమార్ - నిర్మాత సందీప్ సింగ్ ఆనందం వ్య‌క్తం చేశారు. హైకోర్టులో తీర్పు త‌మ‌కు అనుకూలంగా ఉంద‌ని సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌క‌టించారు. అయితే చివ‌రిగా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ (ఈసీ) ప‌రిశీల‌న‌కు వెళ్ల‌గానే స‌మ‌స్య‌ మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. ఈ సినిమాని లోక్ స‌భ ఎన్నిక‌లు ముగిసేవర‌కూ రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని ఈసీ ఆర్డ‌ర్స్ జారీ చేసింది. ఈసీ ఆర్డ‌ర్స్ ప్ర‌కారం మోదీ బ‌యోపిక్ ని ఇంకో నెల‌రోజులు పైగానే రిలీజ్ చేయ‌కుండా ఆపేయాల్సి ఉంటుంది. దేశంలో లోక్ స‌భ ఎన్నిక‌లు మే 19 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. అంటే అప్ప‌టివ‌ర‌కూ ఛాన్సే లేద‌న్న‌మాట‌. ఆ క్ర‌మంలోనే మేక‌ర్స్ సుప్రీంకోర్టులో త‌మ వ్యాజ్యాన్ని వినిపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సోమ‌వారం (ఏప్రిల్ 15న‌) నాడు సుప్రీంలో దీనిపై తుది విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

అయితే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే ఇదివ‌ర‌కూ ఇదే సుప్రీంకోర్టు పీఎం న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ రిలీజ్ విష‌య‌మై స్టే వేయ‌డం కుద‌ర‌ద‌ని ప్ర‌క‌టించింది. సుప్రీం కోర్టు ఛీఫ్ జ‌స్టిస్ రాజ‌న్ గోగాయ్ .. జ‌స్టిస్ దీపిక్ గుప్తా - జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నాలు కోర్టులో తీర్పు వెలువ‌రిస్తూ.. మోదీ బ‌యోపిక్ రిలీజ‌వ్వాలా వ‌ద్దా? అన్న‌ది ఈసీనే చెబుతుంద‌ని తీర్పు వెలువ‌రించారు. త‌ద‌నంత‌ర‌ సినారియోలో.. ఈసీ రిజెక్ట్ చేసిన త‌ర్వాతా తిరిగి ఈ కేసును ప‌రిశీలించేందుకు సుప్రీం అంగీక‌రించ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఈ వివాదంపై నిర్మాత సందీప్ సింగ్ మాట్లాడుతూ.. మోదీ బ‌యోపిక్ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌దు. మోదీకి కానీ - భాజ‌పాకి కానీ ల‌బ్ధి చేకూర్చ‌దు. ఒక‌వేళ అలా జ‌రుగుతుంది అని అనుకుంటే పార్టీల‌న్నీ అన‌వ‌స‌రంగా  క్యాంపెయినింగ్ అంటూ రోడ్ల‌పై తిర‌గ‌డం ఎందుకు?  పార్టీల‌న్నీ వారి నాయ‌కుల‌ బ‌యోపిక్ లే తీసుకుని జ‌నంలో రిలీజ్ చేసుకోవ‌చ్చు క‌దా? అంటూ ప్ర‌శ్నించారు. నిర్మాత‌గా నా ప‌ని నేను చేశాను. ఒక క‌థ న‌చ్చింది. సినిమా తీశాను. ఇదివ‌ర‌కూ అలీఘ‌ర్ స్టోరి న‌చ్చి సినిమా తీసిన‌ప్పుడు న‌న్ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేదు.  మేరీకోమ్ - స‌ర‌బ్ జీత్ క‌థ‌ల్ని నేను మెచ్చిన‌ప్పుడు న‌న్నెవ‌రూ ప్ర‌శ్నించ‌నేలేదు. నా సినిమానే ఎందుకు న‌లిపేస్తున్నారంతా. ఎవ‌రికి వారు నాయ‌కులంతా దేశానికి తామేం చేశారో తెలీని సందిగ్థ‌త‌లో అయోమ‌యంలో బ‌తికేస్తున్నారు. ఇలాంటి వాళ్లే నాకు న‌ష్టం క‌ల‌గ‌జేస్తున్నారు అంటూ ఆవేద‌న చెందారు. ఇప్ప‌టికైతే మోదీ బ‌యోపిక్ రిలీజై సందిగ్ధ‌త వీడ‌న‌ట్టే. ఏప్రిల్ 15న ఏదో ఒక విష‌యం తేల‌నుంద‌న్న‌మాట‌!!
   

Tags:    

Similar News