మోదీ బ‌యోపిక్..ఎన్నిక‌ల కోడ్‌ తో క‌ష్ట‌మేమో?

Update: 2019-03-19 16:34 GMT
బ‌యోపిక్ ల ట్రెండ్ లో పలువురు రాజ‌కీయ నాయ‌కులపై బ‌యోపిక్ లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్, వైయ‌స్సార్ - థాక్రే - మ‌న్మోహ‌న్ సింగ్ వంటి ప్రముఖుల‌పై బ‌యోపిక్ లు తెర‌కెక్కి ఇప్ప‌టికే రిలీజ‌య్యాయి. ఈ సినిమాల జ‌యాప‌జ‌యాల మాటేమో కానీ - జ‌నాల్లో క్యూరియాసిటీ మాత్రం క‌నిపించింది. ప్ర‌స్తుతం దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ బ‌యోపిక్ ప్ర‌భావం జ‌నంపై ఉందా? అంటే అవున‌నే న‌మ్మ‌కాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమాని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని 23 భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు వెర్ష‌న్ ని అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

అయితే ఎన్నిక‌ల వేళ కోడ్ అమ‌ల‌వుతుండ‌గా ఈ సినిమాని రిలీజ్ చేయ‌డం కుద‌ర‌దు కాబ‌ట్టి ఎల‌క్ష‌న్ అనంత‌రం రిలీజ్ చేస్తుండ‌డం విశేషం. ఇప్ప‌టికే ఏప్రిల్ 12 న రిలీజ్ చేస్తామ‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ తేదీని కాస్త ముందుకు తేవ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది. ప‌బ్లిక్ డిమాండ్ మేర‌కు ఏప్రిల్ 5న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని ద‌ర్శ‌కుడు ఒమంగ్ కుమార్ - నిర్మాత లు ఎస్.సింగ్ - ఆనంద్ పండిట్ - సురేష్ ఒబేరాయ్ ప్ర‌క‌టించారు. అయితే ఏప్రిల్ 11 వ‌ర‌కూ ఎన్నిక‌ల హ‌డావుడి ఉండ‌గా ఈ సినిమా రిలీజ్ కి కోడ్ అంగీక‌రిస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.

ఇక నేడు జ‌ర‌గాల్సిన రెండో పోస్ట‌ర్ ఈవెంట్ గోవా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ మ‌ర‌ణం వ‌ల్ల వాయిదా వేసారు. పెద్దాయ‌న మ‌ర‌ణం వ‌ల్ల ఈ పోస్ట‌ర్ వేడుక‌ను వాయిదా వేస్తున్నామ‌ని ఈవెంట్ కి ఆహ్వానం అందుకున్న అతిధులంద‌రికీ అధికారికంగా స‌మ‌చారం పంపించారు నిర్మాత‌లు. ఆ క్ర‌మంలోనే టైటిల్ పాత్ర‌ధారి వివేక్ ఒబేరాయ్ స్వ‌యంగా ఈ పోస్ట‌ర్ ని త‌న సామాజిక మాధ్య‌మాల ద్వారా రిలీజ్ చేసేశారు. ఈ పోస్ట‌ర్ లో ప్ర‌ధానితో పాటు భావి భార‌త పౌరుల అభివంద‌నం క‌నిపిస్తోంది. ఎంతో హుందా అయిన పోస్ట‌ర్ ఇది అంటూ అభిమానుల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తున్నాయి. లెజెండ్ గ్లోబ‌ల్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.


Tags:    

Similar News