'ప్రభాస్ నాకు పెద్దన్నలాంటి వాడు'

Update: 2021-10-21 15:30 GMT
పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ మూవీ ''ఆదిపురుష్''. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. ప్రతినాయకుడు లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడుగా 'సోను కే టిటు కి స్వీటీ' ఫేమ్ సన్నీ సింగ్ కనిపిచబోతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సన్నీ సింగ్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చాడు. ప్రభాస్ తనకు అన్నలాంటివాడని.. స్టార్ అయినప్పటికీ ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటారని అన్నారు.

''ప్రభాస్ నాకు పెద్దన్నలాంటి వాడు. కెమెరా ముందూ వెనక మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అతని గొప్పదనం ఏంటంటే.. అంత పెద్ద స్టార్ అయినా కూడా చాలా సింపుల్‌ గా ఉంటారు. తను స్టార్ అనే విషయం అతనికి తెలుసని అనుకోను. అంత వినయంగా ఉంటారు. ఆతిథ్యంలో ప్రభాస్‌ ను మించిన వారు లేరు. అతని కార్వ్యాన్ లో ఎప్పుడూ నాలుగైదు రకాలు ఆహార పదార్థాలు ఉంటాయి'' అని సన్నీ సింగ్ తెలిపారు.

డార్లింగ్ ప్రభాస్ వ్యక్తిత్వం మరియు సింప్లిసిటీ గురించి.. ఫ్రెండ్ షిప్ కు ఆయన ఇచ్చే వాల్యూ గురించి.. ఆఫ్ స్క్రీన్ లో అతని ప్రవర్తన గురించి ఇండస్ట్రీ జనాలు ఎప్పుడూ గొప్పగా చెబుతుంటారు. ఇటీవల 'ఆదిపురుష్' హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ ని పొగడగా.. ఇప్పుడు సన్నీ సింగ్ కూడా యంగ్ రెబల్ స్టార్ ఒక స్టార్ గా ప్రవర్తించడని చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, 'ఆదిపురుష్' సినిమాకి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ - కృతి సనన్ తమ పాత్రలకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. టీ-సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్‌ పై భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్‌ - ఓం రౌత్ లు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం సాచెత్ తాండన్ - పరంపరా ఠాకూర్ సంగీతం సమకూరుస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఆగస్టు 11న 'ఆది పురుష్' సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ నెల 23న ఈ సినిమా నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ రావొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
Tags:    

Similar News