ఇంకో బాహుబలి..లక్ష కోట్లిచ్చినా చేయడట

Update: 2017-04-18 06:00 GMT
ప్రభాస్ కెరీర్ ను బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అని విభజించాల్సి ఉంటుంది. ఆ సినిమాకు ముందు అతను కేవలం తెలుగు హీరో మాత్రమే. కానీ ఈ సినిమా అయ్యేసరికి నేషనల్ స్టార్ అయిపోయాడు. అన్ని భాషల్లోనూ తిరుగులేని గుర్తింపు సంపాదించాడు. అతడి రేంజే మారిపోయింది.

మరి ‘బాహుబలి’తో ఇంత గుర్తింపు సంపాదించారు కదా.. ఇలాంటి సినిమా ఇంకోటి చేయాల్సి వస్తే చేస్తారా అని ప్రభాస్ ను ప్రశ్నిస్తే.. వామ్మో నా వల్ల కాదంటున్నాడు. లక్ష కోట్లిచ్చినా.. వెంటనే ‘బాహుబలి’ లాంటి సినిమా ఇంకోటి చేయనని అతను తేల్చి చెప్పాడు. ‘‘బాహుబలి కోసం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. లక్ష కోట్లు ఇస్తానని చెప్పి ఎవరైనా బాహుబలి లాంటి ఇంకో సినిమా చేయమని అడిగినా చేయను. కనీసం నాలుగేళ్ల పాటు ఇలాంటి ఆలోచన చేయను. ఆ తర్వాత ఏమైనా చూడాలి’’ అని ప్రభాస్ అన్నాడు.

‘బాహుబలి’ కోసం చూపించిన కమిట్మెంట్ ఇంకే సినిమాకూ తాను చూపించే అవకాశం లేదని కూడా ప్రభాస్ అన్నాడు. ‘‘స్కూలుకెళ్లే పిల్లాడి లాగా ‘బాహుబలి’ షూటింగుకి వెళ్లాను. షూటింగ్ సందర్భంగా రీటేక్ అడగడానికి కూడా భయమేసేది. ఎందుకంటే వార్ సీక్వెన్స్ తీసేటపుడు ఒక రీటేక్ అంటే.. మళ్లీ ఆ సెటప్ అంతా చేయడానికి 3-4 గంటలు పట్టేది. ఒక షాట్ తీయడానికి 30-40 లక్షలు ఖర్చవుతున్నట్లు చెప్పేవాళ్లు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. ఈ సినిమాకు ముందు చేసిన ‘మిర్చి’కి నిర్మాతలు నా స్నేహితులే. అప్పుడు నా ఇష్టం వచ్చిన సమయానికి వచ్చేవాడిని. ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కానీ ‘బాహుబలి’ విషయంలో మాత్రం అలా కాదు’’ అని ప్రభాస్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News