‘మా’ ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్.. రసవత్తర పోరుకు తెర లేచినట్లేనా?

Update: 2021-06-21 03:30 GMT
మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ పొట్టిగా చెప్పాలంటే ‘‘మా’’ ఎన్నికలకు సంబంధించి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్య చేశారు. ఒక చానల్ తో మాట్లాడిన సందర్భంలో ఆయన.. తాను మా అధ్యక్ష స్థానానికి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు ఈ మధ్యన పోటాపోటీగా సాగుతున్నాయి. గత ఎన్నికల సందర్భంగా ఎంతటి హడావుడి చోటు చేసుకున్నదో తెలిసిందే.

తాజాగా తనకు తానుగా అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకాశ్ రాజ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ప్యానల్ లో ఎవరు ఉంటారు? ఆయనకు పోటీగా బరిలోకి దిగే వారెవరు? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి. అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని చెప్పిన ప్రకాశ్ రాజ్ కు ఎవరి మద్దతు ఉంటుంది? అన్న ప్రశ్నను సంధించినప్పుడు ఆయన కాస్త భిన్నంగా స్పందించారు.

మెగాస్టార్ చిరంజీవి మద్దతు మీకు ఉంటుందా? అని ప్రశ్నించినప్పుడు బదులిచ్చిన ప్రకాశ్ రాజ్.. చిరంజీవి అందరి వ్యక్తి అని.. ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరన్నారు. మంచి చేస్తారని ఆయన భావించిన వారికి మద్దతు ఇస్తారంటూ వ్యాఖ్యానించారు. ‘‘అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని ఈ ఎన్నిక కోసం వినియోగించుకోను’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని.. వాటిని అధిగమించటానికితన వద్ద సరైన ప్రణాళిక ఉందన్నారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దదన్నారు. ‘మా’కు ఇప్పటివరకు సొంత భవనం లేదని.. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే వంద శాతం సొంత భవనాన్నినిర్మిస్తానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు సాయం చేయటానికి పరిశ్రమలో చాలామందికి  నటులు ఉన్నారని.. వారందరినీ ఒకే తాటి మీదకు తీసుకొస్తానన్నారు.

ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై తాజాగా నాగబాబు స్పందించారు. ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్ నియమితులైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలో తన వంతు సహకారాన్ని తాను అందిస్తానని చెప్పారు. ప్రకాశ్ రాజ్ లాంటి వారు ఏ ఒక్క చిత్ర పరిశ్రమకో పరిమితం కాదని.. ఆయన భారతీయ నటుడని వ్యాఖ్యానించారు. మొత్తానికి.. ప్రకాశ్ రాజ్ పుణ్యమా అని.. మా అసోసియేషన్ ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News