నేడే ప్రీమియ‌ర్‌.. 19 రోజుల్లోనే వైల్డ్ డాగ్ ఓటీటీలోకి

Update: 2021-04-21 11:56 GMT
కింగ్ నాగార్జున న‌టించిన `వైల్డ్ డాగ్` ఏప్రిల్ 2న రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఎన్ ఐఏ -తీవ్ర‌వాద ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కానీ అనూహ్యంగా బాక్సాఫీస్ వ‌ద్ద వైల్డ్ డాగ్ ఫెయిలైంది. నాగార్జున స‌హా చిత్ర‌బృందం ఊహించ‌ని రిజ‌ల్ట్ ఇది. నిజానికి ఓటీటీ రిలీజ్ కోసం భారీ డీల్ కుదుర్చుకున్న చిత్ర‌బృందం చివ‌రి నిమిషంలో థియేట్రిక‌ల్ రిలీజ్ వైపు మొగ్గు చూప‌డంతో చాలా న‌ష్టం ఎదురైంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియ‌ర్ సిద్ధం చేశారు. ఏప్రిల్ 21 (నేడు) అర్థ‌రాత్రి 12గం.ల‌ నుంచి వైల్డ్ డాగ్  నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండ‌నుంది. అంటే రిలీజైన కేవ‌లం మూడు వారాల్లోపే(19 రోజుల్లోనే) నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియ‌ర్ వేస్తుండ‌డం ఒక సంచ‌ల‌నం అనే చెప్పాలి.

అంతకుముందు వైల్డ్ డాగ్ థియేటర్లలో విడుదలైన 40-45 రోజులలో OTT లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని మేకర్స్ చెప్పారు. అంటే మే మధ్య నుండి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కావచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంత తొంద‌ర‌గా స్ట్రీమింగ్ కి సిద్ధం చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

నాగార్జున అక్కినేని- సైయామి ఖేర్- అలీ రెజా- అతుల్ కులకర్ణి తదితరులు నటించిన వైల్డ్ డాగ్ హైద‌రాబాద్ లో జ‌రిగిన బాంబ్ బ్లాస్ట్ లు నిజఘ‌టనల ఆధారంగా తెర‌కెక్కిన‌ యాక్షన్ థ్రిల్లర్‌. అహిషర్ సోలమన్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ యాక్షన్ సన్నివేశాలతో ఆక‌ట్టుకుంద‌న్న‌ ప్రశంసలు అందుకుంది.
Tags:    

Similar News