ట్రెండింగ్‌ : స‌్టార్స్ ఫ‌ర్ సేల్‌

Update: 2018-12-07 01:30 GMT
అవును.. స్టార్ల‌ ను అమ్మేస్తున్నారు! ఇండ‌స్ట్రీ క్రేజీ స్టార్ల‌ను అమ్మ‌కానికి పెడుతున్నారు. అయితే అది బొమ్మ‌ల రూపంలో. ప్ర‌పంచీక‌రణ పెను ఉత్పాతంలో, సోష‌ల్ మీడియా మార్కెటింగ్ స్కీమ్ లో, ఈ కామ‌ర్స్ మార్కెటింగ్ పుణ్య‌మా అని ప్ర‌తిదీ అమ్మేస్తున్నారు. యూత్ లోకి వేగంగా దూసుకుపోయే క్రేజు ఉన్న సెల‌బ్రిటీల బొమ్మ‌ల్ని ఆన్‌లైన్‌లో అమ్మ‌కాల‌కు పెడుతున్నారు. ఇది వ‌ర‌కూ `బాహుబ‌లి` క్రేజును ఎన్ క్యాష్ చేసుకునేందుకు ఆర్కామీడియా అండ్ టీమ్ ఈ ప‌ని చేసింది. బాహుబ‌లి, భ‌ళ్లాల దేవ‌, శివ‌గామి, క‌ట్ట‌ప్ప, మాహిష్మ‌తి బొమ్మ‌లు మార్కెట్లో అమ్ముడ‌య్యాయి. గూగుల్ సెర్చ్ చేస్తే ఇప్ప‌టికీ బాహుబ‌లి, బ‌ళ్లాల దేవ బొమ్మ‌లు అమ్మ‌కానికి పెట్టి క‌నిపిస్తున్నాయి. అవేకాదు.. క్రేజు ఉన్న సెల‌బ్రిటీల పెళ్లి వేడుక‌ల్ని బొమ్మ‌లుగా మార్చి టాయ్‌ మేక‌ర్స్ అమ్మేయ‌డం ఇప్పుడో ట్రెండ్.

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని నెటిజ‌న్‌ల పిచ్చి పీక్స్ కు చేరింది. ఏది క్రేజీగా అనిపిస్తే దాన్ని క్లోనింగ్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రెండ్ ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల బొమ్మ‌ల త‌యారీ దారుల్లో మ‌రీ ఎక్కువైపోయింది. తార‌ల క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌న్న ఎత్తుగ‌డ‌తో వారు చేస్తున్న చేష్ట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారుతున్నాయి. దాంతో వారి వ్యాపారం కూడా భారీ స్థాయిలోనే జ‌రుగుతూ లాభాల పంట పండిస్తోంది. ఇటీవ‌ల సైఫ్ అలీఖాన్‌, క‌రీనా క‌పూర్‌ల ముద్దుల త‌నయుడు తైమూర్ బొమ్మ‌ల‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చి సంచ‌ల‌నం సృష్టించిన టాయ్‌ మేక‌ర్స్ దృష్టి ఇప్పుడు ప్రేమ జంట నిక్‌, ప్రియాంక‌ల‌ పై ప‌డింది.

తైమూర్ కు సంబంధించిన బొమ్మ‌లు కేర‌ళ‌లోని ఓ స్టోర్ లో బ‌య‌ట‌ప‌డ‌టంతో షాక్ తిన్న బాలీవుడ్ వ‌ర్గాలు తాజా వార్త‌తో మ‌రింత ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నార‌ట‌. తాజా గా జోధ్ పూర్‌కు చెందిన మ‌నోజ్ చౌహాన్ అనే ఓ క‌ళాకారుడు నిక్‌, ప్రియాంక‌ల బొమ్మ‌ల‌ను త‌యారు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. నిక్‌-  ప్రియాంక‌ల నిశ్చితార్థ‌పు బొమ్మ‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

ప్ర‌స్తుతం వీటిని సోష‌ల్ మీడియాలో విరివిగా షేర్ చేస్తుండ‌టంతో బాలీవుడ్ జ‌నాలు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఇక టాలీవుడ్ స్టార్ హీరోల బొమ్మ‌ల్ని త‌యారు చేసి ఇక‌ పై అంగ‌ట్లో పెట్టేయ‌డం ఖాయం అనే భావిస్తున్నారు. ఇక ఈ బొమ్మ‌ల ధ‌ర‌లు అంతే స‌ర‌సంగా ఉన్నాయి. రూ.500 నుంచి అంత‌కుమించి ఎంత ధ‌రైనా ప‌లికే ఛాన్స్ క‌నిపిస్తోంది. అయితే ఇలా ఎవ‌రిని బ‌డితే వాళ్ల‌ను ఎవ‌రో ఒక‌రు అమ్మేసుకుంటే ఎలా? అందుకే ఇక‌ పై ఏ పెద్ద సెల‌బ్రిటీ అయినా త‌మ బొమ్మ‌ల్ని తామే అమ్ముకునేందుకు కాపీ రైట్స్ కూడా తీసుకుంటారేమో?


Tags:    

Similar News