వర్మను యూజ్ లెస్ అన్న పూరి

Update: 2015-11-28 07:48 GMT
అదేంటి రాంగోపాల్ వర్మకు పూరి జగన్నాథ్ వీర విధేయుడు కదా.. మరి వర్మను అతను యూజ్ లెస్ అనడమేంటి? అని ఆశ్చర్యం కలుగుతోంది కదా. ఐతే పూరి నేరుగా వర్మను యూజ్ లెస్ అనలేదు కానీ.. పరోక్షంగా తన గురువునే ఆ మాటే అన్నాడు, తీవ్రంగా విమర్శించాడు. ఇంతకీ పూరి గురువును అంత మాట ఎందుకన్నాడు అంటే.. అమీర్ ఖాన్ వ్యాఖ్యల విషయంలోనే.

ఇండియాలో అసహనం పెరిగిపోతోందని.. తన భార్య దేశం విడిచి వెళ్లిపోదామంటోందని కొన్ని రోజుల కిందట అమీర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ముందుగా స్పందించిన సెలబ్రెటీల్లో వర్మ ఒకడు. ఈ దేశంలో ముగ్గురు ముస్లింలను సూపర్ స్టార్లను చేస్తే.. అసహనం గురించి మాట్లాడ్డమేంటి అంటూ అమీర్ ను విమర్శించాడు వర్మ. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కూడా అమీర్ ను తిట్టిపోశాడు వర్మ.

ఐతే గురువు మాటలకు ఎప్పుడూ మద్దతుగా మాట్లాడే పూరి మాత్రం అమీర్ వ్యాఖ్యల విషయంలో భిన్నంగా స్పందించాడు. నిన్న పీకే సినిమాకు సంబంధించిన అమీర్ ఫొటో ఒకటి పెట్టి దాని కింద ‘‘అమీర్ ఖాన్ ఓ సెలబ్రెటీ కాబట్టే యూజ్ లెస్ పీపుల్ అతడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అమీర్ అల్ ఖైదా లేదా ఐఎస్ ఐఎస్ సభ్యుడై ఉంటే  ఎవరికైనా అతడి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ఉంటుందా?’’ అని ప్రశ్నించాడు పూరి. అమీర్ బాధను ఎవరూ అర్థం చేసుకోవట్లేదని.. అందరూ వివాదాలు సృష్టించడంలో బిజీగా ఉన్నారని పూరి అన్నాడు. మరి పూరి విమర్శలన్నీ వర్మకు తగిలేవేగా. సడెన్ గా గురు శిష్యుల మధ్య ఈ వైరుధ్యం ఏంటో?
Tags:    

Similar News