సెకండ్ పార్టులో కొత్త 'పుష్ప' .. కొత్త మేనరిజం!

Update: 2022-01-16 13:31 GMT
ఒకప్పుడు ఆయా సినిమాలలో మేనరిజమ్స్ .. ఊతపదాలు ఎక్కువగా ఉండేవి. అలా పాప్యులర్ అయిన ఊతపాదాలు చాలానే ఉన్నాయి. సినిమా విడుదల తరువాత కూడా ఆ మేనరిజమ్స్ ను అనుకరించడం .. ఆ ఊతపదాలు ఉపయోగించడం ఎక్కువగా జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో అలాంటివాటిని ఎవరూ టచ్ చేయడం లేదు. సినిమాకి .. సినిమాకి మధ్య హీరోల లుక్ మారుస్తున్నారే గానీ, ఆ పాత్రకి తగినట్టుగా కొత్త మేనరిజం ఉండటం లేదు. చాలా గ్యాప్ తరువాత మళ్లీ అలాంటి ప్రయోగం .. ప్రయత్నం 'పుష్ప' సినిమాలో కనిపించాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో, ఆయన బాడీ లాంగ్వేజ్ .. మేనరిజం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల మనసులను పట్టేశాయి. 'తగ్గేదే లే' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ చిన్నపిల్లలను సైతం విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఒక భుజం సరిగ్గా పనిచేయకపోవడం వలన బన్నీ వేసిన స్టెప్స్ కూడా కొత్తగా అనిపించడమే కాకుండా ఆకట్టుకున్నాయి. ఆయన ఒక కాలు ఈడుస్తూ మూమెంట్ ఇవ్వడం .. ఆ సమయంలో మరోకాలు చెప్పు ఊడిపోవడమనేది పాప్యులర్ అయిపోయింది. ఈ స్టెప్ ను రీల్స్ చేరుస్తున్న వాళ్లు ఎంతమందో!

ఇక ఫస్టు పార్టు భారీ వసూళ్లను కురిపించడంతో, సెకండ్ పార్టు ను సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. ఫస్టు పార్టుకు మించి సెకండ్ పార్టు ఉంటుందని బన్నీ .. సుకుమార్ చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవలసిన బాధ్యత వాళ్లపై ఉంది. అందువలన 'పుష్ప 2' స్క్రిప్ట్ పై మరింతగా కసరత్తు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి ఈ కసరత్తు మొదలవుతుందట. ఈ పార్టులో పుష్ప బాడీ లాగ్వేజ్ లోను .. మేనరిజం లోను సుకుమార్ కొన్ని మార్పులు చేసే ఆలోచనలో ఉన్నాడట.

పుష్ప ను ఒకే విధంగా చూపించి బోర్ కొట్టించకుండా, ఆయన పాత్రకి సంబంధించి కొన్ని మార్పులు చేయనున్నట్టు చెబుతున్నారు. ఆ మార్పులు ఎలా ఉండాలనే విషయాన్ని గురించి బన్నీ .. సుకుమార్ మధ్య చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అలాగే ఇతర పాత్రలను కూడా ఆయన డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సెకండ్ పార్టులో హీరో - విలన్ పాత్రల మధ్య టఫ్ ఫైట్ ఉండేలా ప్లాన్ చేశారట. ఫస్టు పార్టుకు మించిన పాటలను ఇవ్వడానికి దేవిశ్రీ ప్రసాద్ కూడా కసిగా ఉన్నాడని టాక్. మొత్తానికి సెకండ్ పార్టులో పుష్ప కాస్త డిఫరెంట్ గానే కనిపించనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది.     
Tags:    

Similar News