పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్‌ అప్‌డేట్ వచ్చేసిందోచ్‌..!

Update: 2022-06-07 08:41 GMT
అల్లు అర్జున్‌ పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. పుష్ప ను ఒక పాన్‌ ఇండియా మూవీ అన్నట్లుగా కాకుండా సౌత్ సినిమా అన్నట్లుగానే.. తెలుగు సినిమా అన్నట్లుగానే దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించాడు. కాని అనూహ్యంగా పుష్ప 1 కంటెంట్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులకు నచ్చింది. అందుకే పుష్ప 2 ను ఇప్పుడు పాన్‌ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

పుష్ప 1 సినిమా యావరేజ్ గా ఆడి ఉంటే ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ ప్రారంభం అయ్యేది.. ముగింపు దశకు కూడా వచ్చి ఉండేది. ముందుగా అనుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం వెళ్లేందుకు మనసొప్పని మేకర్స్ స్క్రిప్ట్‌ విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు.

బన్నీ కూడా కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కాని పుష్ప 1 రేంజ్‌ లోనే పుష్ప 2 కూడా ఉండాలని పట్టుదలతో ఉన్నాడట. అందుకే స్క్రిప్ట్‌ వర్క్ సాగుతూ ఉంది.

ఒక వైపు స్క్రిప్ట్‌ వర్క్ చివరి దశలో ఉండగానే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా సుకుమార్ మొదలు పెట్టాడట. పుష్ప 2 సినిమా కోసం నటీ నటుల ఎంపిక మొదలు అయ్యింది. ప్రధాన పాత్రలకు నటీ నటులు ఇప్పటికే రెడీగా ఉన్నారు. వారి డేట్లు తీసుకోవాల్సి ఉంది అంతే.. కాని పుష్ప 2 లో కొన్ని కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగానే వెళ్లడిస్తున్నారు.

ఆ కొత్త పాత్రల కోసం ఆడిషన్స్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 10వ తారీకున ఆడిషన్స్ ను నిర్వహించేందుకు గాను సుకుమార్‌ టీం ఇప్పటికే జాబితా తయారు చేసినట్లుగా తెలుస్తోంది. రెండు నుండి నాలుగు రోజుల పాటు పలు పాత్రలకు ఈ ఆడిషన్స్ నిర్వహిస్తారట. ఆడిషన్స్ బాగా చేసిన వారి నుంచి ఆయా పాత్రలకు నటీనటులను ఎంపిక చేయబోతున్నారు.

అల్లు అర్జున్ కు జోడీగా ఈ సినిమా లో కూడా రష్మిక మందన్నా కనిపించబోతుంది. అనసూయ మరియు సునీల్‌ లు ఉంటారు. ఇక కీలక పాత్రలో ఫాహద్ ఫాసిల్ కూడా కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమాను చేయబోతున్నారు కనుక బాలీవుడ్‌ ఫిల్మ్‌ స్టార్స్ ను కూడా ఈ సినిమా కోసం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ అవ్వడంతో పుష్ప 2 పై అభిమానుల ఆసక్తి మరియు చర్చ మళ్లీ మొదలయ్యింది.
Tags:    

Similar News