సైలెంటుగా మాజీ ప్ర‌ధాని పీవీ బ‌యోపిక్

Update: 2019-03-31 04:51 GMT
బ‌యోపిక్ ల ట్రెండ్ అంత‌కంత‌కు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖుల జీవిత‌క‌థ‌ల్ని మ‌న ఫిలింమేక‌ర్స్ అస్స‌లు విడిచిపెట్డడం లేదు. వాస్త‌వంలో జ‌రిగిన య‌థార్థ‌ క‌థ‌ల్ని తెర‌పై చూపించేందుకు ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. గొప్ప గొప్ప వారి జీవితాల్ని తెర‌పై చూడాల‌న్న ఆసక్తి నేటిత‌రంలోనూ ఉండ‌డంతో ఈ ఫార్ములా వ‌ర్క‌వుట‌వుతోంద‌నే చెప్పాలి. క‌మ‌ర్షియ‌ల్ గా ఎమోష‌న్ ని పండించిన ఏ బ‌యోపిక్ ఫెయిల్ కాలేదు. ఎమోష‌న్ పండించ‌లేక‌పోయిన‌వి ఫెయిల‌య్యాయి.

ఇక రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్ లు అంతే వేడి పెంచుతున్నాయి. ఈ కేట‌గిరీలో ప్ర‌ధానులు, ముఖ్య‌మంత్రుల స్థాయి వ్య‌క్తుల‌పై బ‌యోపిక్ లు తెర‌కెక్కిస్తూ హీటెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ముగ్గురు ప్ర‌ధాన మంత్రుల‌పై సినిమాలొస్తున్నాయి. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ బ‌యోపిక్ ఇప్ప‌టికే రిలీజైంది. ప్ర‌స్తుత ప్ర‌ధాని మోదీ బ‌యోపిక్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే విద్యాబాల‌న్ క‌థానాయిక గా ఇందిర‌మ్మ బ‌యోపిక్ తీస్తున్నారు. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నాయ‌కురాలు జ‌య‌ల‌లిత‌పైనా రెండు మూడు బ‌యోపిక్ లు ఒకేసారి తీస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. వీట‌న్నిటి న‌డుమ ప్ర‌స్తుతం తెలుగు వాడైన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు (పాముల ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావు) బ‌యోపిక్ సైలెంటుగా తెర‌పైకొచ్చింది. తెలుగోడా జైకొట్టు! అంటూ దివంగ‌త‌ మాజీ ప్ర‌ధాని పీవీ బ‌యోపిక్ తీస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

చుట్టూ ఉండే వాతావ‌ర‌ణం పీవీని ఎలా మార్చింది? త‌న చుట్టూ ఉన్న వారిని, స‌మాజాన్ని పీవీ ఎలా మార్చి చూపించారు? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం అని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. శ్రీ‌క‌ర్ ఫిలింస్ ప‌తాకంపై శ్రావ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని శ్రీ‌క‌ర్ నిర్మిస్తున్నారు. లిండ్సే చార్లెస్ సంగీతం అందిస్తున్నారు. వంద‌న ప్రీతి రీసెర్చ్ అసోసియేట్ గా ప‌ని చేశారు. నేటి సాయంత్రం 6.30 ప్రాంతంలో ట్రైల‌ర్ ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలుగు వారైన ఎన్టీఆర్, వైయ‌స్సార్  జీవిత‌క‌థ‌ల‌తో సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రో తెలుగు వాడు.. రాజ‌కీయ దురంధురుడు.. నిరాడంబ‌రుడు అయిన పీవీ న‌ర‌సింహారావు జీవిత‌క‌థ‌ను తెర‌పై చూపిస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. పీవీ భార‌త‌దేశానికి ప‌ద‌వ ప్ర‌ధాని కాగా, ఆంధ్ర ప్ర‌దేశ్ కు నాలుగ‌వ ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు.
    
    
    

Tags:    

Similar News