వెంకీతో పీవీపీ వాళ్ల రీమేక్

Update: 2016-06-23 12:19 GMT
‘బ్రహ్మోత్సవం’ దెబ్బకు ఇక పీవీపీ సంస్థ సినిమాలే మానేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా ఫలితం వాళ్లు మరీ అంత డీలా ఏమీ పడిపోలేదని అర్థమవుతోంది. కొన్నాళ్లు సైలెంటుగా ఉన్న పొట్లూరి వరప్రసాద్.. తన తర్వాతి సినిమా విషయంలో సన్నాహాలు మొదలుపెడుతున్నట్లు సమాచారం. విక్టరీ వెంకటేష్ తో ఓ రీమేక్ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి పీవీపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. తమిళ-హిందీ భాషల్లో విజయవంతమైన ‘సాలా ఖడూస్’ను తెలుగులో రీమేక్ చేసేది పీవీపీ సంస్థేనట. వెంకీ ఈ రీమేక్ లో నటిస్తాడని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ‘బాబు బంగారం’ తర్వాత ఆయన నటించే సినిమా ఇదే అవుతుందని అనుకుంటున్నారు. ఐతే నిర్మాణ సంస్థ విషయంలోనే ఓ క్లారిటీ లేకపోయింది.

ఐతే ముందు వేరే వాళ్లను నిర్మాతలుగా అనుకున్నప్పటికీ ఇప్పుడా ప్రాజెక్టును పీవీపీ సంస్థ టేకప్ చేసిందట. తెలుగమ్మాయి అయిన సుధా కొంగర ‘సాలా ఖడూస్’తో మాంచి సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఆమే రూపొందించబోతోంది. ఇప్పటికే వెంకీతో ఆమె ఈ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేసింది కూడా. ఇంకో రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. పీవీపీ సంస్థ ఇప్పటికే రెండు రీమేక్ సినిమాలు నిర్మించింది. తమిళంలో ‘బెంగళూరు డేస్’ ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా.. ఫ్రెంచ్ రీమేక్ ‘ఊపిరి’ మాత్రం ఆ సంస్థకు మెమొరబుల్ మూవీగా నిలిచిపోయింది. ప్రస్తుతం హిందీ-తెలుగు భాషల్లో ‘ఘాజి’ని నిర్మిస్తున్న పీవీపీ.. దీని తర్వాత సెట్స్ మీదికి తీసుకెళ్లేది ‘సాలా ఖడూస్’ రీమేకే కావచ్చు.
Tags:    

Similar News