చిరు జ్ఞాపకాలను నెమరేసుకున్న పీపుల్స్‌ స్టార్‌

Update: 2019-05-22 09:47 GMT
ఉద్యమ నేపథ్యంతో సినిమాలు తీస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న వ్యక్తి ఆర్‌ నారాయణ మూర్తి. పీపుల్స్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్న నారాయణ మూర్తి సినిమాలు ఒకప్పుడు సంచలనాత్మక విజయాలను దక్కించుకునేవి. కాని ఇప్పుడు మారుతున్న పరిస్థితుల కారణంగా ఎర్రన్న సినిమాలను జనాలు పట్టించుకోవడం మానేశారు. అయినా కూడా ఆయన తన బాధ్యతను మరువకుండా సమాజ హితం కోసం ఉద్యమ నేపథ్య సినిమాలు తీస్తూనే ఉన్నాడు.

సక్సెస్‌ లేని వారిని ఎవరు పట్టించుకోరు. అలాగే నారాయణ మూర్తిని కూడా మీడియా వారు పట్టించుకోవడం మానేశారు. ఆయన సినిమాలకు కవరేజ్‌ అంతంత మాత్రంగా ఇచ్చి వదిలేసేవారు. కాని తాజాగా నారాయణ మూర్తి నటించిన 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' చిత్రం ఆడియో విడుదలకు మాత్రం మంచి కవరేజ్‌ దక్కింది. అందుకు కారణం చిరంజీవి. ఆ చిత్రం ఆడియో విడుదలకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయిన కారణంగా సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఈ సందర్బంగా చిరంజీవి గురించి ఆర్‌ నారాయణ మూర్తి మాట్లాడుతూ గత జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. నేను మరియు చిరంజీవి ఒకేసారి సినిమాల్లో నటించాలనే ఉద్దేశ్యంతో చెన్నై వెళ్లాము. అయితే చిరంజీవి నటన శిక్షణ కేంద్రంలో చేరితే నేను డైరెక్ట్‌ గా అవకాశాల కోసం ప్రయత్నించాను. ప్రాణం ఖరీదు చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తే నేను జూనియర్‌ ఆర్టిస్టుగా నటించాను. ఆ సినిమా షూటింగ్‌ కోసం రాజమండ్రి వెళ్లాం. అక్కడ చిరంజీవి మరియు ఇతర నటీనటులతో పాటు మమ్ముల కూడా లాడ్జ్‌ లో ఉంచి మంచి బోజనం పెడతారని అనుకున్నాను. కాని వారిని మాత్రం రాజమండ్రి అప్సర లాడ్జ్‌ లో ఉంచి, మమ్ముల మాత్రం వంట పాకలో ఉంచారు.

షూటింగ్‌ సమయంలో ఒక కుర్రాడు చెవులకు వాక్‌ మెన్‌ పెట్టుకుని సెట్స్‌ లోకి వచ్చాడు. ఎవరా కుర్రాడు అని చూస్తే చిరంజీవి. అప్పుడే నేను ఇండస్ట్రీని రూల్‌ చేస్తావంటూ చిరంజీవితో చెప్పానని పీపుల్స్‌ స్టార్‌ గుర్తు చేసుకున్నాడు. తన సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చిన చిరంజీవికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ వేడుకలో చిరంజీవి పాల్గొనడంతో పాటు పకోడి మరియు జిలేబీ కూడా తినడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

Tags:    

Similar News