చెప్పుకోవ‌టానికి చిరుకేం ఉంది?

Update: 2017-12-13 06:41 GMT
టాలీవుడ్‌లో తిరుగులేని హీరో మెగాస్టార్‌. పొలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు వెండితెర‌కు దూరంగా ఉండి. ఖైదీ నంబ‌రు 150తో రీఎంట్రీ ఇచ్చిన త‌న నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని తీసేసుకున్న గొప్ప‌త‌నం చిరుకు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వ‌యంకృషితో ఒక్కొక్క మెట్టు ఎద‌గ‌ట‌మే కాదు.. ఒక‌ద‌శ‌లో తెలుగు సినిమాకు ఫేస్ గా నిలిచాడు చిరు.

అలాంటి మెగాస్టార్ ముఖం మీద‌నే.. మీరు 150 సినిమాలు తీశారు.. ముస‌లోడు అయ్యాక నేనెంత గొప్ప సినిమా చేశాను అని చెప్పుకోవ‌టానికి ఏదైనా సినిమా ఉందా? అని అడిగే ధైర్యం ఎవ‌రికైనా ఉంటుందా? అంటే లేద‌నే చెబుతారు. కానీ.. అలాంటి మాట‌నే అడిగేశాడు సీనియ‌ర్ న‌టుడు ఆర్ నారాయ‌ణ‌మూర్తి.

విప్ల‌వ భావ‌జాలంతో త‌న‌దైన స్కూల్ సినిమాలు మాత్ర‌మే తీసే ఆర్ నారాయ‌ణ‌మూర్తికి ఒక గుణం ఉంది. గుండెల్లో ఏం ఉంటుందో అదే పెదాల వెంట మాట‌గా వ‌స్తుంది. అంత‌కు మించి క‌ల్లా క‌ప‌టం అన్న‌ది ఉండ‌దు. కొన్నిసార్లు అవ‌స‌రానికి మించి మాట్లాడతార‌న్న పేరున్నా.. అంత ఓపెన్ గా.. కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లుగా మాట్లాడే ధైర్యం నారాయ‌ణ‌మూర్తికే ఉంద‌ని చెప్పాలి.

దివంగ‌త టాలీవుడ్ ప్ర‌ముఖుడు దాస‌రి మీద ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాసిన తెర వెనుక దాస‌రి  పుస్త‌కావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా మాట్లాడిన నారాయ‌ణ మూర్తి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. "ఎన్టీఆర్ చెప్పుకోవ‌టానికి ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయ‌ని.. ఏఎన్నార్‌ కు చెప్పుకోవ‌టానికి గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి. కృష్ణ‌కు అల్లూరి సీతారామారాజు ఉంది. అంద‌రికి ఉన్నాయి. కానీ గ్రేట్‌ మెగాస్టార్ చిరంజీవికి చెప్పుకోవ‌టానికి  సినిమా లేదు. ఆయ‌న ముస‌లోడు అయితే అరే.. నేనెంత గొప్ప సినిమా చేశాను అని చెప్పుకోవ‌టానికి ఏ సినిమా లేదు. కానీ.. ఇప్పుడు మాత్రం సైరా ఉంది. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి మూవీ ఉంది" అని వ్యాఖ్యానించారు.

మెగాస్టార్ ముఖాన అంత ఓపెన్ గా మాట్లాడ‌టం నారాయ‌ణ‌మూర్తికే సాధ్య‌మ‌వుతుందేమో?  నారాయ‌ణ మూర్తి చెప్పిన‌ట్లుగా గొప్ప సినిమాలు అంటూ లేవా? అంటే.. జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి మూవీతో పాటు అప‌ద్బాంధ‌వుడు.. స్వ‌యంకృషి.. రుద్ర‌వీణ లాంటి సినిమాలు ఉన్నాయి. గొప్ప సినిమా అంటే పౌరాణిక‌.. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమానే కాక‌పోవ‌చ్చు.. క‌మ‌ర్షియ‌ల్ మూవీ కూడా మంచి మూవీనే కావొచ్చు. బాలీవుడ్ లో రికార్డుల‌న్నీ బ్రేక్ చేసిన త్రీ ఇడియ‌ట్స్ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ మూవీ. కానీ.. దాన్ని గ్రేట్ మూవీ అన‌కుండా ఉంటారా? అయితే.. కాసింత ఆవేశంతో మాట్లాడే నారాయ‌ణ‌మూర్తి ఆవేశాన్ని.. ఆవేద‌న‌ను అర్థం చేసుకోవాల్సిందే. ఇదిలా ఉంటే.. ఆవేశంతో త‌న‌పై నారాయ‌ణ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌ల‌కు చిరు స‌న్న‌గా న‌వ్వుతూ.. థ్యాంక్యూ అంటూ బ‌దులిచ్చారు.
Tags:    

Similar News