లారెన్స్ ని బాగా దువ్వుతున్నారట!

Update: 2019-05-26 06:40 GMT
గత వారం కాంచన హిందీ రీమేక్ లక్స్ మీ బాంబ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి పెను సంచలనం రేపిన దర్శకుడు కం నటుడు రాఘవ లారెన్స్ ని దువ్వే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయని తెలిసింది. అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ అకౌంట్ లో లక్స్ మీ బాంబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లారెన్స్ కు చెప్పకుండా పోస్ట్ చేయడం వివాదానికి దారి తీసింది. తనను సంప్రదించకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నారని సోషల్ మీడియాలో ఓపెన్ గా ఫైర్ అయిన లారెన్స్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయడం విపరీతంగా వైరల్ అయ్యింది.

అనూహ్యంగా అక్షయ్ ఫ్యాన్స్ కూడా లారెన్స్ కే మద్దతు తెల్పడం అసలు ట్విస్ట్. ఇప్పుడీ సెగలు హీరోతో పాటు నిర్మాతలకు తగిలాయి. ఇప్పటికిప్పుడు దర్శకుడిని మార్చడం అంత ఈజీ కాదు. పైగా చెడ్డ పేరు పెరుగుతుంది. అందుకే రాజీ మంత్రం ప్రతిపాదించారట. దీని ప్రకారం ఆల్రెడీ అక్షయ్ కుమార్ పర్సనల్ గా ఫోన్ చేసి సారీ చెప్పడం ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగాయట.

మరోవైపు ముంబై నుంచి నిర్మాతల టీమ్ ప్రత్యేకంగా దీని గురించే చర్చించేందుకే చెన్నై వస్తున్నారని తెలిసింది. ఇప్పటికే లారెన్స్ కూడా లక్స్ మీ బాంబ్ కోసమే డేట్స్ బ్లాక్ చేసుకున్నాడు. బయటికి వచ్చాక వాటిని దేని కోసం ఉపయోగించాలో ఆలోచనలో ఉండగానే ఇప్పుడీ పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిసింది. చెన్నై మీడియా ప్రకారం లారెన్స్ లక్స్ మీ బాంబ్ ని తిరిగి తన చేతుల్లోకి తీసుకోవడం ఖాయమేనట.


Tags:    

Similar News