రిలీజైపోయిన సినిమాకు రీమేకా?

Update: 2018-06-03 07:40 GMT
తమిళంలో స్టార్ హీరో విజయ్ నటించిన ‘తెరి’ చిత్రం తెలుగులో ‘పోలీస్’ పేరుతో రిలీజైన సంగతి తెలిసిందే. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఆ చిత్రాన్ని విడుదల చేశాడు. దానికి అంత మంచి ఫలితమేమీ దక్కలేదు. కానీ అదే చిత్రాన్ని ఇప్పుడు రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ రీమేక్ చేస్తోంది. ఎన్ని మార్పులు చేసినప్పటికీ ఆల్రెడీ డబ్బింగ్ రూపంలో విడుదలైన సినిమాను రీమేక్ చేయడమేంటో అర్థం కావడం లేదు జనాలకు. ఐతే ఈ కోవలోనే ఇప్పుడు మరో రీమేక్ తెరమీదికి రావడం విశేషం. తమిళంలో విజయ్ సేతుపతి-నయనతార కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘నానుమ్ రౌడీ దా’ను తెలుగులో పునర్నిర్మించనున్నాడట సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్.

ఈ సంక్రాంతికి విడుదలైన ‘గ్యాంగ్’ సినిమాను రూపొందించిన సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నానుమ్ రౌడీ దా’. ఇది తమిళంలో చాలా పెద్ద హిట్టయింది. దీన్ని ‘నేనూ రౌడీనే’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. దాన్ని డబ్ చేసి రిలీజ్ చేసిన సి.కళ్యాణే ఇప్పుడు రీమేక్ ను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే ‘రాజుగాడు’తో పలకరించిన రాజ్ తరుణ్ ఇందులో కథానాయకుడిగా నటిస్తాడట. దర్శకుడి కోసం వేట సాగుతోంది. ఐతే తమిళంలో విజయ్ సేతుపతి అదరగొట్టిన పాత్రకు రాజ్ ఏమాత్రం సూటవుతాడన్నది డౌటు. ఇందులో హీరోది రౌడీ పాత్ర. దానికి ఇతను సెట్టవుతాడా అన్నది చూడాలి. మరి సి.కళ్యాణ్ ఆలోచనేంటో మరి. వరుస ఫ్లాపులతో అవకాశాలు తగ్గిపోయిన నేపథ్యంలో రాజ్.. ఏదైనా అదని ఈ సినిమా ఒప్పేసుకున్నాడేమో.

Tags:    

Similar News