ఆ వార్తలన్నీ అబద్ధం-రాజమౌళి

Update: 2017-09-21 13:10 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను ఎలాంటి పదవిలో నియమించలేదని దర్శక బాహుబలి రాజమౌళి స్పష్టం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి డిజైన్ల రూపకల్పనలో ప్రభుత్వం రాజమౌళి సాయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులతో సమావేశమవ్వడమే కాక.. త్వరలోనే ప్రభుత్వం తరఫున లండన్ కు కూడా రాజమౌళి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి ఏపీ ప్రభుత్వానికి కన్సల్టంట్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ట్విట్టర్లో స్పష్టత ఇచ్చాడు జక్కన్న.

‘‘నేను అమరావతి నిర్మాణానికి కన్సల్టంట్ అని.. డిజైనర్ అని.. సూపర్ వైజర్ అని రకరకాల వార్తలొస్తున్నాయి. అవి అబద్ధం. ఫోస్టర్+పార్టనర్స్ ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ. నా అభిప్రాయం ప్రకారం వాళ్లు సమర్పించిన డిజైన్ ఫస్ట్ క్లాస్ గా ఉంది. చంద్రబాబు గారు.. ఆయన బృందం కూడా ఈ డిజైన్ విషయంలో సంతోషంగా ఉంది. ఐతే అసెంబ్లీ డిజైన్ మరింత గొప్పగా ఉండాలని ఆయన ఆశించారు. నేను ఆయన ఆలోచనల్ని ఫోస్టర్ + పార్టనర్స్ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి ఈ ప్రక్రియ వేగవంతమయ్యేందుకు తోడ్పడుతున్నాను. నా ఈ చిన్న తోడ్పాటు ఒక గొప్ప ప్రాజెక్టుకు మేలు చేస్తుందని ఆశిస్తున్నా’’ అని రాజమౌళి ట్విట్టర్లో వివరించాడు.
Tags:    

Similar News