రాజమౌళి నిర్ణయం ఈసారి ఏ సినిమాలపై ప్రభావం చూపిస్తుందో..?

Update: 2021-08-31 13:40 GMT
దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చెప్పడం కష్టమే. మాస్టర్ స్టోరీ టెల్లర్ అనిపించుకున్న రాజమౌళి.. ఆ స్టోరీని తెర మీదకు తీసుకురాడానికి ఎక్కువ సమయమే తీసుకుంటారు. ప్రతీ సీన్ పెర్ఫెఫ్ట్ గా రావాలని తపిస్తూ జక్కన్న అనే పేరు తెచ్చుకున్నాడు. వంద శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న రాజమౌళి.. ఇప్పటి వరకు ఏ భారీ బడ్జెట్ చిత్రాన్నీ చెప్పిన టైం కి రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని రూపొందించే బాధ్యత భుజాన వేసుకున్నారు రాజమౌళి. గత మూడేళ్ళుగా ఈ సినిమా షూటింగ్ జరుపుతున్న ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తి చేసినట్లు ఇటీవల వెల్లడించారు. దీంతో ఇప్పుడు యావత్ సినీ అభిమానులు 'ఆర్ ఆర్ ఆర్' ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీలను మార్చుకున్న ట్రిపుల్ ఆర్ ను చివరగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయనున్నారని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఈ నేపథ్యంలో రాజమౌళి తదుపరి విడుదల తేదీని బ్లాక్ చేయడానికి చిత్ర నిర్మాతతో డిస్కష్ చేస్తున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే దానికి అనుగుణంగా తమ చిత్రాలను ప్లాన్ చేసుకోవాలని మిగతా ఫిలిం మేకర్స్ వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు జక్కన్న కన్ను సంక్రాంతి సీజన్ పై పడిందని టాక్ వినిపిస్తోంది. దీని కోసం జ‌న‌వ‌రి 8వ తేదీని పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతి బెర్తులపై కర్చీఫ్స్ వేసుకున్న చిత్రాలకు షాక్ ఇచ్చే అంశమనే చెప్పాలి.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని దసరా బరిలో నిలుపుతామని ఇన్నాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ వస్తుండటంతో.. మిగతా పెద్ద సినిమాలు ఇతర ఫెస్టివల్ సీజన్స్ లో డేట్స్ ని బ్లాక్ చేసుకున్నాయి. సంక్రాంతి పండక్కి వస్తున్నట్లు నాలుగు క్రేజీ మూవీస్ రిలీజ్ డేట్స్ ని కూడా ప్రకటించాయి. కానీ ఇప్పుడు మళ్లీ 2022 జనవరి నెలలో తమ చిత్రాన్ని విడుదల చేయాలని రాజమౌళి అండ్ టీమ్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే అక్టోబ‌రు 13న RRR వస్తుందని చాలా సినిమాల విడుదలలో మార్పులు జరిగాయి. ఇప్పుడు ఆ డేట్ కి భారీ ప్రాజెక్ట్ రావడం లేదని తెలియడంతో హడావిడిగా అందరూ విజయదశమి కోసం పోటీ పడే పరిస్థితి వచ్చింది.

ఇప్పుడు సంక్రాంతి రిలీజులు మీద క్లారిటీ వచ్చిన తర్వాత 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని రేసులోకి తీసుకురావాలని చూడటం మిగతా నిర్మాతలకు షాక్ ఇచ్చే విషయం. రాజమౌళి సినిమా థియేటర్లలోకి వస్తుందంటే దరిదాపుల్లో మరో పెద్ద చిత్రాన్ని రిలీజ్ చేసే సాహసం ఎవరూ చేయరు. అలాగే వాటికి మరో మంచి సీజన్ దొరకడం కూడా కష్టమే. అందుకే ఈసారి సంక్రాంతి కి పోటీగా RRR చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తే గిల్డ్ దగ్గర పంచాయతీ పెట్టాలని మిగతా నిర్మాతలందరూ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందే రాజమౌళి సినిమా భారీ వసూళ్లు రాబట్టుకోడానికి.. గతంలో స్టార్ హీరోలు సైతం తమ చిత్రాలను వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం సంక్రాంతి కి వస్తానంటే తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఏదేమైనా జక్కన్న సినిమాల వల్ల టాలీవుడ్ ఖ్యాతి పెరుగుతున్నా.. విడుదల తేదీలను పదేపదే మార్చడం వల్ల ఇతర చిత్ర నిర్మాతలపై ప్రభావం పడుతోందని చెప్పవచ్చు. మరి చివరకు 'ఆర్ ఆర్ ఆర్' కోసం ఏ తేదీని లాక్ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News