హాలీవుడ్ ను లక్ష్యంగా చేసుకున్న జక్కన్న.. ప్రముఖ ఏజెన్సీతో డీల్..!

Update: 2022-09-23 05:29 GMT
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకధీరుడాయన. 'బాహుబలి' ఫ్రాంచైజీతో సంచలనం సృష్టించిన జక్కన్న.. ఇటీవలి RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు హాలీవుడ్ ను టార్గెట్ చేసే దిశగా ప్లాన్స్ వేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వివిధ భాషల సబ్ టైటిల్స్ తో అందుబాటులోకి వచ్చిన తర్వాత.. గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంది. అనేకమంది హాలీవుడ్ ప్రముఖులు జక్కన్న దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు ఓ హాలీవుడ్‌ ఏజెన్సీతో చేతులు కలిపాడనే వార్త ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

అంతర్జాతీయ సహకారాల కోసం ఎస్ఎస్ రాజమౌళి గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నారు. అయితే తాజాగా హాలీవుడ్‌ లీడింగ్‌ క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీ (CAA) తో జక్కన్న ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ఈ డీల్ గురించి మరిన్ని వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి.

సీఏఏ అనేది లాస్‌ ఏంజెల్స్‌ కేంద్రంగా నడిచే క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ. సినిమాల ఎండార్స్‌మెంట్‌ - బ్రాండింగ్‌ - మార్కెటింగ్‌ తోపాటు అవకాశాలను సృష్టిస్తుంది మరియు అనేక మంది హాలీవుడ్ డైరెక్టర్లు - నటీనటులకు ప్రాతినిథ్యం వహిస్తుంది. అయితే ఇప్పుడు రాజమౌళి సైతం వారితో డీల్ కుదుర్చుకోవడంతో.. మన దర్శకుడు కూడా ఈ లెజెండ్స్ జాబితాలోకి చేరాడని అంటున్నారు.

రాజమౌళి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మీడియా ఇంటరాక్షన్‌ లో జక్కన్న మాట్లాడుతూ.. మహేశ్ తో గ్లోబ్‌ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాజమౌళి టాప్ స్టూడియోలతో కలిసి పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు సీఏఏతో ఒప్పందం కారణంగా బడ్జెట్ మరియు సాంకేతిక అంశాల ద్వారా కూడా SSMB29 చిత్రానికి గొప్ప బూస్ట్ గా ఉంటుంది. ఇది రాజమౌళి తో పాటుగా మహేశ్‌ బాబును గ్లోబల్‌ స్టార్‌ గా మార్చేందుకు సహాయ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏదేమైనా టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఇంటర్నేషన్ ఏజెన్సీతో డీల్ సెట్ చేసుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన డైరెక్ట్ చేసిన RRR చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ కు భారతదేశం తరవున అఫిషియల్ ఎంట్రీగా పంపించకపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న SSMB29 చిత్రాన్ని.. వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News