`ప‌ద్మావ‌తి` థియేట‌ర్ పై రాజ్ పుత్ ల దాడి!

Update: 2017-11-14 18:21 GMT
బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన‌ ప‌ద్మావ‌తి చిత్రంపై వివాదాలు ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేవు. ఆ చిత్రంలో ప‌ద్మావ‌తి పాత్రను వ‌క్రీక‌రించార‌ని, ఆ చిత్ర విడుద‌ల‌ను నిలిపివేయాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా 'ప‌ద్మావ‌తి' చిత్ర విడుద‌ల‌ను ఆప‌లేర‌ని ఆ చిత్ర హీరోయిన్ దీపికా ప‌దుకొనే చెప్పింది. ఆ చిత్రంలో న‌టించినందుకు ఒక మ‌హిళ‌గా తాను చాలా గ‌ర్వ‌ప‌డుతున్నానని తెలిపింది.అయితే, ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన రోజే ప‌ద్మావ‌తి చిత్ర ట్రైల‌ర్ ను ప్ర‌ద‌ర్శించిన థియేట‌ర్ పై దాడి జ‌రిగింది. మాకు చూపించ‌కుండా ఆ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తే థియేట‌ర్ల‌పై దాడి చేస్తాం...అంటూ కొన్నాళ్లుగా వ‌స్తున్న బెదిరింపులను నిజం చేస్తూ రాజ‌స్థాన్ లోని కోటాలో ఉన్న ఆకాశ్ థియేట‌ర్ ను కర్ణిసేన ఆధ్వ‌ర్యంలో రాజ్‌పుత్‌ వర్గీయులు ధ్వంసం చేశారు. కర్ణిసేన కార్యకర్తలు, రాజ్ పుత్ వ‌ర్గీయులు ఆకాశ్‌ థియేటర్‌పై దాడి చేసి కౌంటర్‌ అద్దాలను, కిటికీలను ధ్వంసం చేశారు. దాడుల‌కు పాల్ప‌డిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ప్రజాస్వామికంగా ఆ చిత్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెల‌ప‌వ‌చ్చ‌ని, అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని రాజస్థాన్‌ హోంమంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా హెచ్చ‌రించారు. ఆ సినిమాను నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్‌ గోయెల్ ....కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. గ‌త నెల‌లో ఈ సినిమాకు వ్యతిరేకంగా గుజ‌రాత్‌లోని కర్ణిసేన ఆధ్వర్యంలో దాదాపు లక్ష మంది రాజ్‌పుత్‌ వర్గీయులు ఆందోళ‌న చేప‌ట్టారు. తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉండ‌ద‌ని, రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందించేలా ఈ సినిమా ఉంటుంద‌ని సంజయ్‌ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చినా ఆందోళ‌న‌లు ఆగ‌డం లేదు. మ‌రోవైపు ఈ సినిమాను అడ్డుకోవాల‌ని సుప్రీం కోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ ను కొట్టివేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదాలు, దాడుల నేప‌థ్యంలో డిసెంబ‌రు 1 న ప‌ద్మావ‌తి విడుద‌లపై ఉత్కంఠ ఏర్ప‌డింది.
Tags:    

Similar News